Konduri Ravinder Rao | హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): చైర్మన్‌గా ఉన్న తొమ్మిదేండ్లలో తెలంగాణ సహకార బ్యాంకులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దినట్టు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు తెలిపారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకులను బలోపేతం చేయడంతోపాటు రైతులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించామని వివరించారు. టెస్కాబ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఆయన ఆబిడ్స్‌లోని టెస్కాబ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తనపై అవిశ్వాసం పెట్టారని, కానీ అంతకన్నా ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో సహకార బ్యాంకులను ఎవరూ పట్టించుకోలేదని, తద్వారా రుణాలు అందక, ఇతర అవసరాలు తీరక సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రైతులకు న్యాయం జరిగేలా, సహకార బ్యాంకులను బలోపేతం చేసేందుకు నాటి సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని వివరించారు. టెస్కాబ్ చైర్మన్‌గా ఎన్నికైన తనకు ఆ బాధ్యతలను అప్పగించారని, కేసీఆర్ సహకారంతో సహకార బ్యాంకులను బలోపేతం చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అప్పటికే 25 ఏండ్లుగా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీని నిలిపివేయగా, తాము వచ్చిన తర్వాత 7,165 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.
సహకార ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా నిలిపామని గుర్తుచేశారు. సహకార బ్యాంకుల మూల సిద్ధాంతం సింగిల్ విండో విధానాన్ని అమలుచేశామని పేర్కొన్నారు. నాబార్డ్ సహకారంతో రుణాలు తీసుకొని సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల ఏర్పాటు, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి అన్ని వ్యాపారాలను నిర్వహించినట్టు తెలిపారు. సహకార బ్యాంకుల కంప్యూటరీకరణ, ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వివరించారు. ఈ రెండు అంశాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, అనేక రాష్ర్టాలు తమ విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు.
సహకార బ్యాంకులను బలోపేతం చేసి, సాఫీగా సాగుతున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఊహించని పరిణామం ఎదురైందని కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. బోర్డులోని డైరెక్టర్లు వారి అవసరం, స్వార్థం కోసమో, మరే ఇతర కారణాలతోనో పార్టీ మారి తనపై అవిశ్వాసం పెట్టారని అన్నారు. అందుకే తాను చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంచేశారు. తాను ఎప్పుడూ పదవులను ఆశించలేదని, పార్టీతో సంబంధం లేకుండా బ్యాంకుల, రైతుల అభివృద్ధికి కృషి చేశానని వివరించారు. సహకారం అనేది ఒక ఉద్యమమని, ఇది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. తాను బతికి ఉన్నంత కాలం సహకార బ్యాంకుల బలోపేతం కోసం పనిచేస్తానని స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే వారికి పగ్గాలు అప్పగించాలని కోరారు. సమావేశంలో టెస్కాబ్ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కూడా తన రాజీనామాను ప్రకటించారు.