హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): మెడికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జి డైరెక్టర్గా (డీఎంఈ) డాక్టర్ ఎన్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనల్లోని 10(హెచ్ )కు, 2017లో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 63 ఉన్నదని ప్రకటించింది. అందుకే జీవో అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. చట్ట ప్రకారం రెగ్యులర్ డీఎంఈని నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇంచార్జి డీఎంఈగా డాక్టర్ ఎన్ వాణిని నియమిస్తూ ఫిబ్రవరి 19న ప్రభుత్వం జీవో 63ను జారీ చేయడాన్ని వనపర్తి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు.