Telangana Formation Day | కలబడి, నిలబడి, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. పదేండ్ల లేబ్రాయంలోనే దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచి వెలుగుతున్న తెలంగాణ ప్రగతి అడుగడుగునా ప్రతిబింబించేలా ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధమైంది. ‘దస్ కా దస్కత్.. తెలంగాణ ఖూబ్ సూరత్’ అంటూ ఇతర రాష్ర్టాలన్నీ వేనోళ్ల పొగిడేలా.. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది తెలంగాణ. ప్రత్యర్థులు సైతం చిత్తరువయ్యేలా అనతికాలంలోనే అద్భుత ప్రగతి నమోదు చేసింది తెలంగాణ. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమిష్టి భాగస్వామ్యంతో నేడు రాష్ట్ర ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తున్నది. వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్య రంగం, ఆర్థిక ప్రగతి, రాష్ర్టానికి వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక ఐటీ అభివృద్ధి ఇలా ప్రతిరంగం విజయాలన్నీ ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘తెలంగాణ నిండుగా.. పదేండ్లు పండుగ’ సంబురాలకు జూన్ 2న తెరలేవబోతున్నది.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పదో ఆవిర్భావ దినోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అదేరోజు రాష్ట్ర మంత్రులు వారివారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు. ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 2023 జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దేశంలోనే అతిపిన్న వయసు గల రాష్ట్రమైనా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో నేడు అన్ని రంగాల్లో అత్యద్భుత ఫలితాలు సాధిస్తూ దేశానికే రోల్ మాడల్‌గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అభివృద్ధి సాధించడమే కాకుండా ఆ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందేలా చూడటంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని, తెలంగాణలో అదే జరుగుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో కూడుకుని ఉన్నదనడానికి తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని చెప్పారు. పేరుకు తొమ్మిదేండ్లయినా మొదటి సంవత్సరంతోపాటు కరోనా కాలపు రెండేండ్లు కలిపి దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిందని, కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతి సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.