Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): ధార్మిక కార్యక్రమం అనే సోయి లేదు. విద్యార్థుల కార్యక్రమమనే విచక్షణ లే దు. పిల్లల కార్యక్రమనే పట్టింపు లేదు. వేది క ఏదైనా, కార్యక్రమం మరేదైనా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ విమర్శలనే పరమావధిగా చేసుకుంటున్నారు. ఇది తాజాగా మరోసారి నిరూపితమైంది. బుధవారం రవీంద్రభారతిలో పదో తరగతి ఫలితాల కార్యక్రమంతో పాటు బసవేశ్వరుని జయం తి వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ రెండు అంశాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ సందు దొరికితే చాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నోరుపారేసుకునే ఆయన మరోసారి తన నోటికిపని చెప్పారు. విద్యార్థుల కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయాలు ఉండొద్దనే విచక్షణ మరిచిన రేవంత్‌రెడ్డి ప్రసంగం మొత్తం కేసీఆర్‌ను తిట్టిపోశారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాటలకు ప్రతి విమర్శలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ఈ వేదికను వినియోగించుకున్నారు. ఓ పెద్దాయన (కేసీఆర్‌ను ఉద్దేశించి) వరంగల్ సభలో రాష్ట్రంలో పథకాలన్నీ ఆగిపోయాయని అంటున్నారని, ఏ పథకం ఆగిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఆగిందా? కల్యాణలక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిందా? ఉచిత విద్యుత్తు ఆగిందా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏడాదిలోనే రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిందని, 60వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు.
నీ చరిత్రకు అక్కడే శాశ్వత సమాధి
కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. ఇటీవలే కేసీఆర్ మరణాన్ని ఆకాంక్షించేలా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో నాలుక మడతేసిన సీఎం.. మీడియాతో చిట్‌చాట్ పెట్టి తాను ఎవరి మరణాన్ని కాంక్షించడం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఇది జరిగి కొద్ది రోజులైనా గడవకముందే మళ్లీ నోటి దురుసును ప్రదర్శించారు. బసవేశ్వర జయంతి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పదేండ్లు అధికారంలో ఉంటుందని, తామూ పదేండ్లు అధికారంలో ఉంటామని చెప్పారు. కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘నీ చరిత్ర అక్కడే శాశ్వతంగా సమాధి అయిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.
నా పేరెత్తే ధైర్యం చేయలేదు
వరంగల్ సభ మొత్తంలో ఆయన (కేసీఆర్) తన పేరు తీయలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. తన పేరు తీసుకునే ధైర్యం రాలేదని పేర్కొన్నారు. అయితే తన ప్రసంగం మొత్తం కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఎక్కడా కేసీఆర్ పేరు ఉచ్ఛరించకపోవడం గమనార్హం. అంటే కేసీఆర్ పేరు తీసేందుకు రేవంత్‌రెడ్డికి కూడా ధైర్యం చాలలేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మాట ఇస్తే నూరు శాతం అమలు చేస్తా
తాను ఒక మాట ఇస్తే నూటికి నూరు శాతం అమలు చేస్తానని రేవంత్ చెప్పారు. ఇంత వరకు ఎక్కడ కూడా ఈ మాట ఇచ్చి చేయలేదని శత్రువులు కూడా అనలేదని పేర్కొన్నారు. మాట ఇచ్చేముందే తాను ఆలోచించి ఇస్తానని చెప్పారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతుభరోసా 15వేలు ఇస్తామని చెప్పింది, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది, ధాన్యానికి బోనస్ ఇస్తామన్నది మీరే కదా… ఎందుకు అమలు చేయడం లేదంటూ? ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమంలో మరో మాట కూడా చెప్పారు. మాటలు మాట్లాడే ముందు విచక్షణ ఉండాలి కదా అంటూ వరంగల్‌లో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏదైనా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన ఉండొద్దా అని అన్నారు. కానీ విచక్షణ గురించి మాట్లాడిన సీఎం.. ఇదే సభలో విచక్షణ మరిచి మాట్లాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ విమర్శలు చేయడం, తప్పుడు ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బసవన్నను అవమానించేలా…
బసవేశ్వరుని జయంతి కార్యక్రమం సాక్షిగా రేవంత్ బసవన్న(ఎద్దు)ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘అచ్చొచ్చిన ఆంబోతులా’ అంటూ నోటి దురుసు ప్రదర్శించారు. బసవేశ్వరుని ప్రతిరూపంగా బసవన్నను కొలుస్తారు. అలాంటి కార్యక్రమంలోనే బసవన్నను అవమానించేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.