మఠంపల్లి, సెప్టెంబర్ 27: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం వర్దాపురం బీట్‌లో గల దక్కన్ సిమెంట్స్ సీఏ ల్యాండ్‌ను ఆదివారం హైదరాబాద్ విజిలెన్స్ డీఎఫ్‌వో శివయ్య తనిఖీ చేయడానికి రాగా మంచ్యాతండాకు చెందిన గిరిజనులు అడ్డుకోవడానికి యత్నించారు. ఈ భూములు ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు అటవీశాఖ అధికారులు అడ్డుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మాలోతు మంగ్యా అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులకు రైతులకు మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది. చావడానికైనా.. చంపడానికైనా సిద్ధమని, భూములను మాత్రం వదులుకోమని రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో శివయ్య మాట్లాడుతూ.. ఈ భూములు అటవీశాఖకు సంబంధించినవేనని స్పష్టం చేశారు. రైతుల వద్ద భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్, డాక్యుమెంట్లు ఉంటే కలెక్టర్‌కు అందజేయాలని సూచించారు. పత్రాల ఆధారంగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. దౌర్జన్యంగా అటవీ భూముల్లోకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.