Neera Cafe | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గౌడన్నల ఆత్మగౌరవ పతాక నీరా కేఫ్ కల్లు కాంపౌండ్‌గా మారనుందా? అంటే అవుననే అంటున్నారు కల్లుగీత కార్మికులు, గౌడ సంఘాల నాయకులు. టూరిజం కార్పొరేషన్ నుంచి కల్లుగీత కార్పొరేషన్లోకి విలీనం చేసుకున్న నీరాకేఫ్‌ను కల్లుగీత కార్పొరేషన్ పూర్తిస్థాయిలో నిర్వహించకుండానే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేసింది. దాని నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి టెండర్లు ఆహ్వానించింది.
నెక్లెస్ రోడ్‌లోని నీరాకేఫ్, ఆ భవనంలోని మెషినరీతో పాటు నీరా ప్రాసెసింగ్ యూనిట్, పైన లేక్ వ్యూ బాంక్వెట్ హాల్ (ఒకటో అంతస్తు), ఆరు కమర్షియల్ షాపుల లీజు కోసం కల్లుగీత కార్పొరేషన్ టెండర్లు కోరింది. వాటిల్లో బాంక్వెట్ హాల్‌కు నెలకు రూ. 2 లక్షలు, నీరా ప్రాసెసింగ్ యూనిట్‌కు రూ.75 వేలు, ఆరు కమర్షియల్ షాపుల్లో ఒక్కో షాపునకు రూ. 25 వేలు ప్రతినెలా అద్దె వచ్చేలా నిబంధనలు రూపొందించింది. మొత్తంగా నెలకు కనీసం రూ.4.25,000 ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రచించింది. ప్రతి నెలా 5వ తేదీన వాటికి చెల్లించాల్సిన మంత్లీ లీజ్ తప్పకుండా చెల్లించాలని నిబంధనల్లో పేర్కొన్నది. కానీ, నీరాను సరఫరా చేసే వ్యవస్థను మాత్రం వదిలివేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కల్లుగీత కార్మికులు సుమారు 3 లక్షల మంది వరకు ఉన్నారు. నీరాకేఫ్‌ను ప్రైవేటుకు అప్పగిస్తే వారు విధించే రేట్లకు కేఫ్ కాస్తా కల్లు దుకాణంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిని ప్రభుత్వమే నిర్వహిస్తే రూ. 30 కోట్లు వస్తాయని, ఆ సొమ్మును గౌడన్నల సంక్షేమానికి ఖర్చు చేయవచ్చని చెప్తున్నారు. నగరంలోని కల్లు కాంపౌండ్లు ఇప్పటికే గుత్తేదారుల చేతిలో నలుగుతున్నాయని, కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని పలు సంఘాలు కోరుతున్నాయి. లేదంటే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
కల్లుగీత కార్పొరేషన్ ద్వారానే నీరాకేఫ్ నిర్వహించాలని నిరుపేద గీత వృత్తిదారులకు ఉపాధి కల్పించాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ కోరారు. గీత కార్పోరేషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో గీతన్నల సంక్షేమం కోసం కృషిచేయాలన్నారు. పాడి పరిశ్రమలా నీరా పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానం రూపొందించాలని కోరారు. హైదరాబాద్‌లో కల్లుగీత సంఘాలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీరాకేఫ్ నిర్వహణకు పిలిచిన టెండర్లను నిలిపివేయాలని కోరారు. టెండర్లు పిలిచే ముందు గౌడ, కల్లుగీత సంఘాలను ప్రభుత్వం సంప్రదించకపోవడం బాధాకరమన్నారు. నిజమైన వృత్తిదారులకు న్యాయం జరగాలంటే గీత కార్పొరేషన్ ద్వారానే నీరాకేఫ్‌ను నిర్వహించాలన్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా తెలంగాణలోనూ నీరా బోర్డులు ఏర్పాటు చేసి గీత కార్పొరేషన్ ద్వారా వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు.