హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్ ఇక కనుమరుగు కానున్నదా? ఈ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నదా? ఇందులోభాగంగానే ఆగ్రోస్‌కు ఏ వ్యాపారాన్ని ఇవ్వడంలేదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా ఆగ్రోస్‌కు ఇస్తున్న ధాన్యం కొనుగోలు పరికరాల సరఫరా టెండర్ల నుంచి ఆ సంస్థను తప్పించింది. ఆగ్రోస్‌ను పూర్తిగా పక్కనపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెండర్ల బాధ్యతను హాకాకు అప్పగించారు. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది ఆగ్రోస్ పరిస్థితి. ధాన్యం కొనుగోలు పరికరాల టెండర్లను అప్పగించకపోవడం ఆగ్రోస్‌కు పెద్దదెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే యాంత్రీకరణకు సంబంధించిన పరికరాల సరఫరా టెండర్‌ను కూడా ఆగ్రోస్‌కు ఇవ్వలేదు. దీనిని కూడా హాకాకు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆగ్రోస్‌కు ఎలాంటి పనీ లేకుండా పోయింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాల కోసం నానా తంటాలు పడుతున్నారు. టెండర్ల ద్వారా వచ్చే కమీషన్ కూడా ఇప్పుడు రాకుండా పోయింది. దీంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ పడింది. వరుసగా టెండర్లు దూరం కావడంతో ఇకపై ఆగ్రోస్ మనుగడ కష్టమేననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొన్నది.
అధికారులు ఆగ్రోస్ అభివృద్ధిని పక్కనపెట్టారనే విమర్శలున్నాయి. కొన్నేండ్లగా ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ఏర్పాటు మినహా ఆ సంస్థ చేసిన పనులు పెద్దగా ఏమీలేవనే విమర్శలున్నాయి. అందుకే రోజురోజుకి నష్టాల్లో కూరుకుపోయి ఆర్థికంగా దిగజారిందనే అభిప్రాయాలున్నాయి. దీనికితోడు తాజాగా అవినీతి, కమీషన్ల ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠ మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేషన్లను మూసివేయడం లేదా కలిపేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం చేసింది. ఇందులో భాగంగానే ఆగ్రోస్‌ను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆగ్రోస్‌కు టెండర్లు ఇవ్వకపోవడం, ఆ సంస్థను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం… ఇదంతా సంస్థ అధికారుల స్వయంకృపరాధమేననే విమర్శలున్నాయి. ఇటీవల సంస్థపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ రాజకీయ నేత అరగేంట్రంతో సంస్థలో అవినీతి భారీగా పెరిగిందనే ఆరోపణలున్నాయి. బిల్లుల చెల్లింపులో కమీషన్ల వసూళ్లు సంస్థకు చెడ్డపేరు తెచ్చిపెట్టాయనే చర్చ నడుస్తున్నది.
టెండర్‌దారులను పిలిచి కమీషన్లు డిమాండ్ చేయడం, 30-40% కమీషన్లు చెల్లిస్తేనే బిల్లులు ఇస్తామంటూ బెదిరించడం గతంలో సంచలనంగా మారింది. దీంతోపాటు గతంలో కొన్ని టెండర్లను సంస్థకు అప్పగించగా ఇందులో సదరు నేత తన అనుయాయులతో టెండర్లు వేయించినట్టు ఆరోపణలున్నాయి. సమయం పూర్తయిన తర్వాత కూడా టెండర్ బాక్స్ ఓపెన్ చేయించి మరీ టెండర్ వేయించడం అప్పట్లో పెద్ద దూమారమే లేపింది.
వీటికితోడు సదరు నేత, ఉన్నతాధికారుల మధ్య పొసగకపోవడం కూడా సంస్థకు నష్టం చేసిందనే విమర్శలున్నాయి. కమీషన్ల కొట్లాటలో సంస్థను బజారున పడేశారనే ఆరోపణలున్నాయి. సంస్థను అభివృద్ధి చేయడం పక్కనపెట్టి వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. ఈ అవినీతి ఆరోపణలన్నీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. మంత్రి ఆదేశాలతోనే ఆగ్రోస్‌ను అన్ని టెండర్ల నుంచి పక్కనపెట్టినట్టు సమాచారం.