హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ అభివృద్ధికి రంగం సిద్ధమయ్యింది. 11అంతస్థుల్లో హాస్టల్, 12 అంతస్థుల్లో క్లాస్రూమ్ కాంప్లెక్స్(అకాడమిక్ బ్లాక్)ను నిర్మించనున్నారు. ఇవే కాకుండా ప్రత్యేకంగా కిచెన్, రెండువేల మంది సామర్థ్యం గల ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, లైబ్రరీని సైతం నిర్మించనున్నారు. వర్సిటీ చుట్టూ గ్రిల్స్ నిర్మిస్తారు. కోఠి మహిళా కాలేజీని మహిళా వర్సిటీగా అప్గ్రేడ్చేయగా… ఇటీవలే యూజీసీ గుర్తింపు ఇచ్చింది. రూ. 500 కోట్ల నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో అకాడమిక్, హాస్టళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
వర్సిటీలో ప్రస్తుతం 18 మంది రెగ్యులర్ ఆచార్యులున్నారు. వీరిలో ఇద్దరు అ సోసియేట్ ప్రొఫెసర్లు కాగా, 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లే. వీరితోపాటు మరో 42మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 400కుపైగా ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. వీరంతా ఉస్మానియా యూనివర్సిటీ కిందే ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ నుంచి కొత్త వర్సిటీ ఏర్పడటంతో బోధన, బోధనేతర సిబ్బందిని విభజించాల్సి ఉంది. ఉద్యోగుల విభజనలో భాగంగా అందరికీ ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఉస్మానియా, మహిళా వర్సిటీల్లో ఏదో ఒకదాంట్లో కొనసాగే ఆప్షన్లు ఇస్తారు. ఆయా ఆప్షన్ల ప్రకారమే విభజిస్తారు. ఆప్షన్లు ఇచ్చినా.. ఉద్యోగులను విభజించినా మహిళా వర్సిటీలో కొత్త రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు అంతా మహిళా వర్సిటీలోనే పనిచేయాల్సి ఉంటుందని ఇటీవలే ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ తెలిపారు.
హైదరాబాద్ నడిబొడ్డున కోఠిలోని వర్సిటీకి 41.77 ఎకరాల స్థలం ఉంది. యూజీ, పీజీ కలుపుకుంటే మొత్తం 31 డిపార్ట్మెంట్లున్నాయి. ఈ వర్సిటీలో మొత్తం 72కోర్సులు నిర్వహిస్తుండగా, ఈ వర్సిటీలో 7వేల మంది విద్యార్థులున్నారు. హాస్టళ్లు, క్లాస్రూమ్ కాంప్లెక్స్ నిర్మాణ బాధ్యతలను టీజీఈడబ్యూఐడీసీకి అప్పగించారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. త్వరగా టెండర్లను పూర్తిచేసి.. జూలై రెండోవారంలో పనులు ప్రారంభించాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. రెండున్నరేండ్లల్లో హాస్టళ్లు, క్లాస్రూమ్ కాంప్లెక్స్‌ను పూర్తిచేయాలని గడువు పెట్టుకున్నారు. దీంతో 2027 డిసెంబర్ కల్లా కొత్త భవనాలు అందుబాటులోకి వస్తాయి.