హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దేవాదాయ, ధర్మాదాయశాఖలో పేరుకుపోతున్న దస్ర్తాలు, టెండర్ల ఆమోదం, మతపరమైన ఉద్యోగ నియామకాల్లో గందరగోళంపై నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం ఆ శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కమిషనర్లు మారుతున్నారనే కారణం చూపుతూ ఫైళ్లు ఎందుకు పెండింగ్లో పెడుతున్నారంటూ ఉన్నతాధికారులు ఆరా తీశారు. శనివారం దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ నేతృత్వంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ముందుగా మతపరమైన ఉద్యోగుల నియామకాల్లో గందరగోళంపై చర్చ జరిగింది. నోటిఫికేషన్లు, నియామకాలు, నిబంధనలపై శైలజారామయ్యర్ ఆరా తీశారు. నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం ప్రస్తావనకు వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చే సమయంలోనే అన్ని విషయాలు సరిగా చూసుకోవాలి కదా అని అధికారులను శైలజారామయ్యర్ మందలించినట్టు తెలిసింది. ఏడాది క్రితం ప్రధాన కార్యాలయానికి వచ్చిన దస్ర్తాలు కూడా ఇప్పటివరకు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని నిలదీసినట్టు సమాచారం.
అసలేం జరుగుతున్నది?
దేవాదాయశాఖలో ఈ-ఆఫీస్ అమలవుతున్నదా లేదా అని కూడా శైలజారామయ్యర్.. అధికారులను నిలదీసినట్టు తెలిసింది. అధికారులు నీళ్లు నమలడంతో కచ్చితంగా అమలు చేయాలని, ఏ ఫైల్ వచ్చినా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని సూచించారని సమాచారం. కొన్ని ఆలయాల్లో నెలకొన్న గందరగోళమైన పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు, టెండర్ల ఫైళ్లు ఆగిపోతున్న వైనంపై చర్చించారు. ఆన్లైన్ విధానం అమల్లో అలసత్వం కారణంగా కొందరు అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకుంటున్నట్టు ప్రస్తావనకు వచ్చింది. సిబ్బంది ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ స్పష్టంచేయాలని శైలజారామయ్యర్ ఏడీసీలకు తేల్చిచెప్పారని సమాచారం. ఈ సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయశాఖ అధికారులు, ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతున్నది. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీల అంశాన్ని త్వరలో పరిష్కరించాలని, ఇందుకు కమిటీని నియమించాలనే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. నమస్తే తెలంగాణ కథనంలో పేర్కొన్న అంశాలపై సమగ్రంగా చర్చ జరగడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకునేలా తీర్మానాలు చేసినట్టుగా సమాచారం. ఈ సమావేశంలో ఏడీసీ, ఆర్జేసీ, ఉపకమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.