గీసుగొండ, జూన్ 8: పంట దిగుబడులు లేక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం గీసుగొండ మండలం రెడ్డిపాలెంకు చెందిన వరగాని సత్య(40) 2.13 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని రెండేండ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. దిగుబడి సరిగా రాకపోగా అనారోగ్యానికి గురైన భార్య వైద్యం కోసం, పిల్లల చదువుల కోసం రూ. 6 లక్షల వరకు అప్పులు చేశాడు.
అప్పులిచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తుండటంతో తట్టుకోలేక ఈనెల 1న సత్య మొగిలిచెర్ల శివారులోని కెనాల్ కట్ట వద్ద గడ్డి మందు తాగి కొడుకు యశ్వంత్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి చేరుకున్న కుమారుడు.. అపస్మారక స్థితిలో ఉన్న తండ్రిని ఎంజీఎం దవాఖానకు తరలించాడు. అతడు చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.