హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వచ్చే వారంపాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతాయని పేర్కొన్నది. 21, 22 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో శుక్రవారం అత్యల్పంగా మెదక్‌లో 12 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 13.2, హైదరాబాద్‌లో 14.2, దుండిగల్‌లో 15.2, నల్లగొండలో 15.4, హనుమకొండలో 15.5, రామగుండంలో 15.6, హకీంపేటలో 15.9, నిజామాబాద్‌లో 16.1, ఖమ్మంలో 17, మహబూబ్‌నగర్‌లో 18.1, భద్రాచలంలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.
ఏపీకి మరోసారి వానముప్పు
ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి వాన ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా బలపడుతున్నదని, ఈ నెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.