ప్రభుత్వం పైకి చెప్తున్నట్టు.. 22ఏ పొరపాటున జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు దీని తీవ్రత గురించి ఆలస్యంగా తెలిసిందా? సారీ చెప్తే ‘బారా ఖూన్ మాఫ్’ అవుతుందా? అసలు అది పొరపాటేనా? యాదృచ్ఛికమా? పక్కా కుట్రనా?
22ఏ నిన్నమొన్న తెరమీదికి వచ్చిందికానీ, అందుకు తెరవెనుక తెగ ప్రయత్నాలు జరిగాయి. పదినెలల క్రితమే నిషేధ జాబితాను ప్రభుత్వం రూపొందించింది. అక్టోబర్‌లో 22ఏ జాబితాను ఖరారు చేసి, డిసెంబర్లో రాష్ట్ర హైకోర్టుకే నివేదించింది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ వ్యవహారమంతా జరిగింది. మూడునెలల క్రితమే అది జనసామాన్యానికి తెలిసింది. రిజిస్ట్రేషన్ ఆఫీసు మెట్లెక్కాక, ఆస్తులు అమ్ముకోలేమని తెలిసి అవాక్కయ్యారు జనం. ఆ ఆవేదన ఆగ్రహంగా మారాక సర్కార్ సన్నాయినొక్కులు ప్రారంభించింది. అధికారుల తప్పిదమన్నట్టుగా, తమకేమీ తెలియదన్నట్టుగా కలరింగ్ ఇచ్చింది.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల ప్రైవేట్, పట్టా భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం పొరపాటు కాదా? ఇది పక్కా కుట్రనా, ప్రణాళిక ప్రకారమే చేశారా? నిషేధిత భూముల వివాదం ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు ఎప్పుడో తెలుసా? స్వయంగా మంత్రులే చెప్పినా పట్టించుకోకుండా తాత్సారం చేశారా? 22-ఏ భూముల మాటున భారీ భూ దోపిడీకి కుట్ర చేశారా?’ ఇవీ ప్రస్తుతం అధికార వర్గాల్లో, రెవెన్యూ నిపుణుల్లో కలుగుతున్న అనుమానాలు. అధికారుల తప్పిదం వల్లే ప్రైవేట్, పట్టా భూములు పొరపాటుగా 22-ఏ నిషేధిత జాబితాలో చేరాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నది. ప్రభుత్వ పెద్దల భూదాహం, అధికారుల నిర్వాకం వెరసి ఇప్పుడు సామాన్యులు నిషేధిత చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు.
ఏడాది క్రితమే జాబితా సిద్ధం
రాష్ట్రంలో నిషేధిత భూముల వివరాలు అందజేయాలని, ఓపెన్ డొమైన్లో పెట్టాలని రాష్ట్ర హైకోర్టు 2024లో ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లోని జీపీవో, సబ్ రిజిస్ట్రార్ మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అంతా కలిసి నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేశారు. దీనిని 2025 డిసెంబర్లో హైకోర్టుకు సమర్పించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోర్టుకు డిసెంబర్లో నివేదిక సమర్పించారంటే, కనీసం నెల, రెండు నెలల ముందే జాబితా సిద్ధమై ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ లెక్కన 2025 అక్టోబర్, నవంబర్లోనే జాబితా సిద్ధమైందని అంచనా వేస్తున్నారు. దీనిని హైకోర్టుతోపాటు రిజిస్ట్రేషన్ల శాఖకు సమర్పించారని పేర్కొన్నారు. దీని ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, అంటే అప్పటినుంచే రిజిస్ట్రేషన్ల సమస్య మొదలైందని విశ్లేషిస్తున్నారు.
పొరపాటంటే నమ్మేదెలా?
ప్రభుత్వానికి నిషేధిత జాబితా చేరి దాదాపు తొమ్మిది నెలలవుతున్నది. అప్పటినుంచి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఇప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా.. ప్రైవేట్ భూములను పొరపాటున నిషేధిత జాబితాలో పెట్టారని, తప్పైందని, క్షమించండి అంటూ కూనిరాగాలు తీస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రికి తెలియకుండానే ఇదంతా జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలంగా ఇటు మంత్రి, అటు అధికారులు ఏం చేస్తున్నట్టు? అని అడుగుతున్నారు.
ఏడాది కాలంగా అందులోని లోపాలు, తప్పులను గుర్తించలేకపోయారా? గతంలో అన్నీ సవ్యంగా ఉన్న భూములు, ప్రైవేట్ భూములు నిషేధిత జాబితాలోకి చేరాయని పసిగట్టలేకపోయారా? అని నిలదీస్తున్నారు. పైగా నిషేధిత భూముల గురించి, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం గురించి తాను మూడు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అంటే సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయం ఎప్పుడో తెలిసింది. ఆ వెంటనే మంత్రి పొంగులేటికి కూడా తెలిసి ఉంటుంది. ఈ లెక్కన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు తదితరులకు సైతం ఈ వివాదం ఎప్పుడో తెలిసినట్టు సమాచారం. అయినా, ఇప్పుడే తెలిసినట్టు నాటకం ఆడి, రక్తి కట్టిస్తున్నారని మండిపడుతున్నారు.
ముందే హెచ్చరించిన ‘నమస్తే తెలంగాణ’
22-ఏ నిషేధిత జాబితా పిడుగును ‘నమస్తే తెలంగాణ’ ముందే పసిగట్టింది. ప్రభుత్వం అడ్డగోలుగా ప్రైవేట్ స్థలాలు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను నిషేధిత జాబితాలో పెడుతున్నదని, తద్వారా భారీ భూదోపిడీకి కుట్ర పన్నుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ కథనం హెచ్చరించింది. 2025 డిసెంబర్ 7వ తేదీన ‘నిషిద్ధ జాబితాలోకి కోటి ఎకరాలు’.. ‘రైతులారా, భూ యజమానులారా.. బహుపరాక్’ అంటూ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఇదే అక్షర సత్యమైంది. నిషేధిత భూముల వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని విలువైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, వాటిని అడ్డంగా దోచుకొనేందుకు భారీ కుట్ర చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే 22-ఏ పేరుతో నిషేధిత భూముల వివాదాన్ని సృష్టించి, వారి కన్నుపడిన భూములను ఈ జాబితాలో చేర్చి, విడిపించే పేరుతో వాటిని దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.