హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. కాం గ్రెస్ సర్కార్ నిర్ణయాలతో ఇప్పటికే ఈ రంగం కుదేలైంది. ప్రస్తుతం తెచ్చిన 22ఏ నిషేధిత జాబితాతో ఈ రంగంపై కాంగ్రెస్ సర్కార్ ఏకంగా మరణ శాసనమే రాసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూయజమానులకు భూతంలా మారిన ఈ 22ఏతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ఆదాయంపై తీవ్రప్రభావం పడింది. ఈ దెబ్బతో భూములు, ఇండ్ల క్రయ విక్రయాలు పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం పాతాళానికి పడిపోయింది. 22-ఏ నిషేధిత భూముల భయంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఇప్పుడెందుకు కొనుగోలు చేయడమనే ఆలోచన చేస్తున్నారు.
ఇప్పటికే జరిగిన అగ్రిమెంట్లు సైతం రద్దు చేసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ చేసిన 22-ఏ నిషేధిత భూముల నిర్వాకం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నెల మొదటి వారంలో 22,136 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, ప్రభుత్వానికి రూ.216.66 కోట్ల ఆదాయం సమకూరింది. 22-ఏ వివాదం బయటకు రావడంతో రెండో వారంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య 16,268కి పడిపోయింది. ఆదాయం భారీగా తగ్గి రూ.173.85 కోట్లకు పడిపోవడం గమనార్హం. అంటే తొలి వారంతో పోల్చితే రెండో వారంలో 5,868 డాక్యుమెంట్లు తగ్గగా, రూ.42.81 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. మూడో వారం మరింత దారుణంగా ఉండటం గమనార్హం. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల సంఖ్య 12,999కి పడిపోగా, ఆదాయం రూ.152.08 కోట్లకు తగ్గిపోవడం గమనార్హం.
జూలైలో భారీ ఆదాయం
జూలై నెలలో రిజిస్ట్రేషన్లు, ఆదాయాన్ని పరిశీలిస్తే భారీగా ఉండటం గమనార్హం. ఆ నెల తొలి వారంలో రూ.238 కోట్లు, రెండో వారంలో రూ.253 కోట్లు, మూడో వారంలో రూ.258 కోట్లు, నాలుగో వారంలో రూ.248 కోట్ల చొప్పున భారీ ఆదాయం సమకూరడం గమనార్హం. కానీ 22-ఏ దెబ్బతో ఆగస్టు నెలలో ఒక్క మొదటి వారంలోనే ఆదాయం రూ.200 కోట్లు దాటింది. ఇలా 22-ఏ భయంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది.
కొనుగోలు, అమ్మకందారుల్లో ఆందోళన
ఇండ్ల స్థలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారుల్లో 22ఏ నిషేదిత జాబితా వివాదం గుబులురేపుతున్నది. కొనుగోలు ఆలోచనలను విరమించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొనుగోలు చేయడం అంత మంచిది కాదనే భావనలో ఉన్నారు. తీరా కొనుగోలు చేశాక అది నిషేధిత జాబితాలో ఉంటే పరిస్థితి ఆగమేననే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. అందుకే తాత్కాలికంగా కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే జరిగిన పలు ఒప్పందాలు సైతం 22ఏ దెబ్బతో రద్దవుతున్నట్టుగా తెలిసింది. నిషేధిత జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కొనుగోలుదారులు ఆ అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
అమ్మకందారులు గడువు ఇచ్చేందుకు హామీలు ఇస్తున్నా.. వివాదంలో ఉన్న భూములను కొనుగోలు చేసేందుకు సంశయం వ్యక్తంచేస్తున్నట్టుగా తెలిసింది. దీంతో పిల్లల పెండ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాలకోసం విక్రయించిన ప్లాట్లు, ఫ్లాట్లు ఇప్పుడు రద్దవుతుండడంతో అమ్మకందారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. రిజిస్ట్రేషన్లు రద్దు కావడంతో కొనుగోలుదారులు డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తుండటం,మరోవైపు అవసరాలు పీకల మీద ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. రియల్ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 22ఏజాబితాతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడంతో వారంతా రోడ్డునపడే పరిస్థితి దాపురించింది. దీంతో ఇటు కొనుగోలుదారులు, అటు అమ్మకందారులు, మరోవైపు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.

Real