Telangana Youth | ఏజెంట్ల చేతిలో మోసాలకు గురై విదేశాల్లో ఇబ్బందుల పాలవుతున్న వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి. నకిలీ వీసాలు చేతిలో పెట్టి విమానాలు ఎక్కిస్తున్నారని తెలిసినప్పటికీ.. మోసగాళ్లనే నమ్ముతూ మళ్లీ మళ్లీ నిలువు దోపిడీకి గురవుతున్నారు. తాజాగా ఏజెంట్ల చేతుల్లో మోసపోయి దుబాయ్‌లో తిండీతిప్పలు లేకుండా సాయం కోసం తెలంగాణ యువకులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ తమను తెలంగాణకు రప్పించేలా అధికారులతో మాట్లాడి సాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఏజెంట్ల చేతిలో మోసపోయిన పలువురు రాజన్న సిరిసిల్ల వాసులు దుబాయ్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్నారు. కంపెనీ యాజమాన్యంతో తాగి గొడవ చేస్తున్నారని వీరిపై కేసులు నమోదయ్యాయి. కేసులు పూర్తయ్యే వరకు దుబాయ్ విడిచి వెళ్లేందుకు వీళ్లేదంటూ వారిని అక్కడి అధికారులు వేధిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక నానా యాతన అనుభవిస్తున్నామని దుబాయ్ ఎయిర్‌పోర్టు ముందు నిలబడి ఒక వీడియోను రికార్డు చేసి పంపారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్న వారిలో రాజన్న సిరిసిల్లకు చెందిన నలుగురు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక యువకుడు ఉన్నారు.
దుబాయ్ కంపెనీలో ఉద్యోగాలంటూ సిరిసిల్ల, వేములవాడ, నిజామాబాద్ ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలకు హాజరై పెద్ద మొత్తంలో నగదు సమర్పించుకున్నారు. తీరా దుబాయ్‌కు వెళ్లిన తర్వాత ఇండియాలో చెప్పిన పని కాకుండా ఇతర పనులు అప్పగించారు. చేసిన పనులకైనా జీతం ఇవ్వాలంటూ కంపెనీ యాజమాన్యంతో వీరు వాదానికి దిగారు. దాంతో సదరు కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేయించారు. తమ ఇబ్బంది చెప్పి ఇంటి నుంచి డబ్బు తెప్పించుకుని ఇండియాకెళ్లేందుకు టిక్కెట్లు తీసుకోగా.. ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ పాస్ ఇచ్చాక అక్కడికొచ్చిన పోలీసులు టిక్కెట్లను చించివేసి బయటకు వెళ్లగొట్టారని వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ బాధను వినేవారు లేకపోవడంతో ఎయిర్‌పోర్టు వద్దనే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ వారు దుబాయ్‌లో తిండి లేని రాత్రులు గడుపుతున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వారిని ఇండియాకు రప్పించేలా చేయాలని వేడుకుంటున్నారు.