హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి.. అక్కడ మృతిచెందిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన శ్రీపాద నరేశ్ మృతదేహానికి ఐదేండ్ల తర్వాత అక్కడే అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవకాశం లేకపోవడంతో బహ్రెయిన్ అధికారులు ఐదేండ్లుగా మృతదేహాన్ని భద్రపరిచారు. అప్పటి నుంచి అనేక సంప్రదింపులు జరిగినప్పటికీ నరేశ్ భౌతికకాయాన్ని తీసుకురావడం సాధ్యపడలేదు.
దీంతో అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారు. దీంతో ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసీ ప్రజావాణిలో మృతుడి సోదరుడు ఆనంద్‌తో కలిసి అఫిడవిట్ అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ అకడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని కోరారు. మృతుడి సోదరుడు ఆనంద్ బహ్రెయిన్ వెళ్లి, అంత్యక్రియలకు హాజరుకానున్నారని తెలిపారు.