రెండు లైంగికదాడి యత్నాలు.. ఓ న్యాయవాది సహా మరో గుర్తు తెలియని యువకుడి హత్యతో హైదరాబాద్ నగరం సోమవారం అట్టుడికింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడి ప్రయత్నం జరుగగా, తప్పించుకొనే క్రమంలో నడుస్తున్న రైలు నుంచి దూకిన ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఓ కార్యక్రమానికి బాలీవుడ్ నటిని అతిథిగా పిలిపించి, ఆమెపై లైంగికదాడికి యత్నించడం కలకలం రేపింది. చంపాపేట్ పరిధిలో ఓ న్యాయవాది పట్టపగలే దారుణ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది.
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 ( నమస్తే తెలంగాణ) : నగరంలో నడుస్తు న్న రైలులోనే ఓ యువతిపై దుండగుడు లైంగిక దాడికి యత్నించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన యువతి (23) మేడ్చల్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. ఈ నెల 22న సెల్‌ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చిన యువతి తిరుగు ప్రయాణంలో తెల్లాపూర్-మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లేడీస్ కోచ్‌లో ఎక్కింది. అప్పటికే ఆ బోగీలో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. ఇంతలో లేడీస్ కోచ్‌లోకి ఎక్కిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి ప్రయత్నించాడు. ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురై అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. తీవ్రగాయాలతో పడి ఉన్న ఆ యువతిని గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆమెతలకు, దవడ ఎముకకు గాయమైందని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నదని రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తుపడతానని బాధితురాలు చెప్పడంతో స్పెషల్ టీమ్స్‌ను ఉపయోగిస్తున్నట్టు ఎస్పీ చందన తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన కొందరు బాలీవుడ్‌కు చెందిన ఓ సహాయనటిని షాపు ప్రారంభానికని ముంబై నుంచి ఈ నెల 18న పిలిపించారు. ఆమెకు మాసబ్‌ట్యాంక్‌లోని సత్య అపార్ట్‌మెంట్స్‌లో వసతి కల్పించారు. ఈ నెల 21న ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఆమె ఉంటున్న గదిలోకి వచ్చి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడి, ఆమె వద్దనున్న రూ.50వేలు తీసుకొని పారిపోయారు. బాధితురాలు 100కు ఫోన్‌చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను విడిపించారు. నిందితులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పది సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని చెప్పారు. ఆర్థిక లావాదేవీల్లో తేడాతోనే తప్పుడు ఫిర్యాదు చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మాసబ్‌ట్యాంక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు సహకరించలేదన్న కోపంతో ఓ దుండగుడు ఏకంగా ఓ న్యాయవాదిని నడిరోడ్డుపై దారుణంగా చంపాడు. చంపాపేట డివిజన్, ఈస్ట్ మారుతీనగర్, శ్రీనివాస అపార్ట్మెంట్లో నివసించే ఇజ్రాయెల్ (54) రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన ఉండే అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా కాంతారావు, అతని భార్య కల్యాణి పనిచేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌కు అప్పుడప్పుడు ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ మరమ్మతులకు వచ్చే దస్తగిరికి కల్యాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన కాంతారావు తన భార్యను తీసుకొని సొంత ఊరు వెళ్లిపోయాడు. కల్యాణిని ఎలాగైనా మళ్లీ నగరానికి రప్పించాలని దస్తగిరి వెళ్లి న్యాయవాది ఇజ్రాయెల్‌ను కోరాడు. తాను న్యాయవాదినని, బ్రోకర్‌ను కానని, పద్ధతులను మార్చుకోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించాడు. అయితే తాను కాంతారావును హత్యచేస్తానని, అరెస్టయితే కనీసం బెయిల్ ఇప్పించాలని దస్తగిరి కోరాడు. దీనికి అంగీకరించని ఇజ్రాయెల్ అతడిని మందలించాడు. దీంతో కక్ష పెంచుకున్న దస్తగిరి పథకం ప్రకారం సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌పై కత్తితో దాడిచేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని డీఆర్డీఓ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
జియాగూడ : బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రక్తపు మడుగులో పడి ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసుల కనుగొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని వ్యక్తి (35) మృతదేహం ఉన్నట్టు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. తలపై తీవ్రగాయలు ఉండడంతో బండరాళ్లతో కొట్టి చంపినట్టు నిర్ధారించారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. ఎంఎంటీఎస్ రైలులో ఉద్యోగినిపై లైంగికదాడి యత్నమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బాధితురాలిని మాజీ మంత్రి సబిత పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల భద్రతపై దృష్టి సారించాలని అన్నారు.