హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎలాంటి నీటి కేటాయింపులు లేకపోయినా కృష్ణా జలాలను అక్రమంగా పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం దానిని నిర్మించడమే గాకుండా, ప్రస్తుతం మరింతగా విస్తరిస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. వెంటనే వెలిగొండ ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య మండలిని (కేఆర్ఎంబీ) కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గురువారం లేఖను రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా మిగులు జలాలపై ఏపీ ప్రభుత్వానికి బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి హక్కులనూ ఇవ్వలేదని, కేవలం వినియోగించుకునే స్వేచ్ఛను ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అక్రమంగా అనేక ప్రాజెక్టులను నిర్మిస్తూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ రాష్ట్రం మండిపడింది. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి తీసుకెళ్లారని, ఏపీ తీరును అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో గట్టిగా వ్యతిరేకించారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో అనుమతుల్లేకుండా ఎలాంటి ప్రాజెక్టులను చేపట్టవద్దని కేంద్రం సైతం ఏపీకి ఆదేశాలు జారీ చేసిందని లేఖలో స్పష్టంచేసింది. అయినప్పటికీ ఏపీ కొత్తగా వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అర్దవీడు మండలంలో రెండు ఎత్తిపోతలను రూ.51.16 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ఏపీ అనుమతులు మంజూరు చేసిందని ధ్వజమెత్తింది. కేఆర్ఎంబీ వెంటనే స్పందించి వెలిగొండ ప్రాజెక్టుతోపాటు దానికి అనుబంధంగా చేపడుతున్న ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని తెలంగాణ ఆ లేఖలో డిమాండ్ చేసింది.