హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : తమకు తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు) వారసులు వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తమ గోడు ఏఐసీసీ పెద్దలకు తెలిసేలా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు 81, 85 ద్వారా సుమారు 16,500 మంది వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పోస్టింగ్లు ఇచ్చిందని గుర్తుచేశారు. 61 ఏండ్లు పైబడిన 3,797 మంది వీఆర్ఏలను గుర్తించి, వారి వారసులకు విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తామని జీవోలో పొందుపరిచారని తెలిపారు. పదో తరగతి పాసైన వారికి అటెండర్, ఇంటర్ చదివిన వారికి రికార్డు అసిస్టెంట్, డిగ్రీ పూర్తిచేసిన వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని జీవోలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని, దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ధర్నాకు పలువురు బీసీ సంఘం నేతలు మద్దతు ప్రకటించారు.
ఖమ్మం అర్బన్, మార్చి 31 : సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు, డీఏ బకాయిల విడుదల కోసం ఖమ్మం జిల్లాలోని పలు విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం బీసీ గురుకుల పాఠశాలలో శశిధర్ మాట్లాడుతూ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేస్తున్న రూ.700 కోట్లలో సీపీఎస్ బకాయిలకు మొండిచేయి చూపిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల హామీ మేరకు పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.