మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ మానస పుత్రికలు పల్లె, పట్టణ ప్రగతి వల్ల తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao), సత్యవతి రాథోడ్(Satyavati Rathod) అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వడ్డే కొత్తపల్లిల, పెద్ద వంగర గ్రామాల్లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో వారు మాట్లాడారు.
బీఆర్ఎస్(BRS) లాంటి పార్టీ దేశంలో మరెక్కడా లేదని అన్నారు. 80లక్షల మంది బలగం ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. పార్టీలో కార్యకర్తలు, నాయకులు మధ్య ఏదేని చిన్న సమస్యలుంటే పార్టీకోసం వాటిని పక్కన పెట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR) సహకారంతో రాష్ట్రంలోని గ్రామాలకు అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా తెలంగాణకు తాజాగా 13 జాతీయ అవార్డులు(National awards) వచ్చాయని తెలిపారు. ఈ అవార్డులే ప్రభుత్వ పనితీరుకు గీటురాయని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో పనులు జరిగాయని వెల్లడించారు. తెలిపారు. వరంగల్ లోని టెక్స్టైల్ పార్క్ ద్వారా బస్సులు ఏర్పాటు చేసి, నియోజకవర్గ మహిళలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చేస్తామన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ తెలంగాణ, సీఎం కేసీఆర్ పై కక్ష కట్టిందని ఆరోపించారు. అయినా ఎవరికీ భయపడకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అభివృద్ధి చేసి చూపిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.