హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలు, మండలాలు, జిల్లాలకు అందించే అవార్డులను అత్యధిక సంఖ్యలో కైవసం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గతంలో ఈ అవార్డులు తెలంగాణకు భారీగా వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మార్గదర్శకాలు మారినప్పటికీ మునుపటి కంటే ఎక్కువ అవార్డులను సాధించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో దాదాపు అన్ని శాఖల అధికారులకు శిక్షణ ఇచ్చి జాతీయ అవార్డులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న గ్రామాలను పోటీలో నిలబెట్టాలని నిర్ణయించారు. ఆయా పంచాయతీల్లో చేపట్టిన కార్యక్రమాలు, ఇతర వివరాలను అక్టోబరు 31లోగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన వాటికి కేంద్రం ఏప్రిల్ 24న అవార్డులను అందజేస్తుంది.
నిర్ధారణకు కమిటీలు
జాతీయ అవార్డులకు గ్రామాలు, మండలాలు, జిల్లాలు 9 అంశాల్లో పోటీ పడాల్సి ఉంటుంది. ఏ ఏ గ్రామాలు ఏ అంశాల్లో పోటీపడాలో నిర్ధారించేందుకు బ్లాక్ పంచాయతీ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ కమిటీ (బీపీపీఏసీ)లను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలన్నింటికీ ఎంపీడీవో చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ కమిటీ (డీపీపీఏసీ)లను ఏర్పాటు చేస్తారు. వీటికి కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటారు. స్టేట్ పంచాయతీ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ కమిటీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ గ్రామాలు, మండలాలు, జిల్లాలను ఎంపిక చేసి సిఫారసు చేస్తుంది.
నగదు బహుమతుల వివరాలు
జాతీయస్థాయి ఉత్తమ పంచాయతీలకు 9 విభాగాల్లో అవార్డులను అందజేస్తారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి కింద రూ.50 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.40 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.30 లక్షలు అందిస్తారు. ఉత్తమ మండలాలకు సైతం ఇదే తరహాలో నగదు బహుమతులను అందజేస్తారు. ఉత్తమ జిల్లాలకు ప్రథమ బహుమతి కింద రూ.1.50 కోట్లు, ద్వితీయ బహుమతిగా రూ.1.25 కోట్లు, తృతీయ బహుమతిగా కోటి రూపాయలు అందిస్తారు. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ కింద కూడా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 విభాగాల్లో జాతీయ పురస్కారాలను అందజేస్తుంది. ఉత్తమ పంచాయతీలు, మండలాలకు మొదటి బహుమతి కింద రూ.1.50 కోట్లు, రెండో బహుమతిగా రూ.1.25 కోట్లు, మూడో బహుమతిగా రూ.కోటి చొప్పున అందిస్తారు. ఉత్తమ జిల్లాలకు మొదటి బహుమతి కింద రూ.5 కోట్లు, రెండో బహుమతిగా రూ.3 కోట్లు, మూడో బహుమతిగా రూ.2 కోట్లు అందజేస్తారు.