National water awards | న్యూఢిల్లీ : ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో శనివారం నాలుగో జాతీయ జల అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఉత్తమ నీటి విధానాలను అవలంబించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించినందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ఈ సందర్భంగా జగన్నాథపురం గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ కలిసి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఉత్తమ జిల్లాల క్యాటగిరీలో ఆదిలాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ సంస్థల విభాగంలో హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం రెండోస్థానం దక్కించుకొన్నది. యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ప్రశంసా పత్రం, ట్రోఫీతోపాటు నగదు బహుమతి అందజేశారు. జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు.