నిజామాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) జరిగిన ఆచార్యుల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. 2012 ఫిబ్రవరి 25న జారీ చేసిన మూడు వేర్వేరు నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేసిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను రద్దు చేస్తూ అక్టోబర్ 31న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పును వెలువరించారు. ఉమ్మడి రాష్ట్రపు చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 13 మంది ప్రొఫెసర్లు, 30 అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం 91 ఆచార్యుల నియామకాలకు మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీఅయ్యాయి. జీవో 420 నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయి, రోస్టర్ పాయింట్లు మార్చారని ఆరోపిస్తూ హైకోర్టులో 11 మంది అభ్యర్థులు, పలువురు అధ్యాపకులు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
2012 ఏప్రిల్ 27న జరిగిన తెలంగాణ యూనివర్సిటీ 20వ పాలకవర్గ సమావేశంలో అప్లయిడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఐదేండ్ల కోర్సులను నిలిపివేశారు. రెండేండ్ల ఎంఏ-ఎకనామిక్స్, ఎమ్మెస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. నిలిపివేసిన కోర్సులను నోటిఫికేషన్లలో చేర్చి ఐదేండ్ల కోర్సులకు సంబంధించి 1:3:7 క్రమంలో రోస్టర్‌ను అమలుచేశారు. వాస్తవానికి రెండేండ్ల కోర్సులకు 1:2:4 క్రమాన్ని అనుసరించాలి. రోస్టర్ పాయింట్లను మార్చి ఇతర సబ్జెక్టులలో రిజర్వేషన్లను ప్రభావితం చేశారు. తద్వారా ఈ నియామకాల్లో అడ్డదిడ్డంగా రిజర్వేషన్లను అమలు చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని హైకోర్టు గుర్తించి నియామకాలను రద్దుచేసింది. కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసుకునే స్వేచ్ఛను తెలంగాణ యూనివర్సిటీకి ఇచ్చింది.
అప్లయిడ్ ఎకనామిక్స్‌ను జాబితాలో మొదటిస్థానంలో చూపి హిందీ పోస్టును ఓసీకి మార్చారు. వాస్తవానికి ఇది ఎస్టీకి రావాలి. బాటనీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మారుతీరావు మరణించడంతో ఏర్పడిన ఖాళీని ఈ నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఇది కూడా రోస్టర్‌ను మార్చేసింది. నోటిఫికేషన్లు జారీఅయ్యాక కోర్సులను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా యూనివర్సిటీ పాలకవర్గం ఏకంగా సరిదిద్దుకోలేని పొరపాటుతో అడ్డంగా హైకోర్టుకు దొరికిపోయింది. పదమూడేండ్లపాటు సాగిన విచారణలో తెలంగాణ యూనివర్సిటీ వితండవాదం చేసింది. కోర్సులు పూర్తిగా నిలిపివేయలేదని తెలిపింది. మొదటి సంవత్సరం అడ్మిషన్లు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పుకుంది. విద్యార్థుల డిమాండ్‌తో తిరిగి ప్రవేశపెట్టి 2013 మార్చి 21న జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నట్టు పేర్కొంది.
నోటిఫికేషన్ సమయంలో కోర్సులు ఉన్నాయని, రోస్టర్‌ను సరిగ్గా అనుసరించామని వాదించింది. పిటిషనర్లు సెలక్షన్ ప్రక్రియలో పాల్గొని విఫలమైన తర్వాత పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించింది. వాదోపవాదాలు సుదీర్ఘంగా జరిగిన పిదప హైకోర్టు న్యాయమూర్తి నగేశ్ భీమపాక 24 పేజీల్లో తుది తీర్పును వెలువరించారు. నోటిఫికేషన్లు రద్దు చేయడంతో పాటు విశ్వవిద్యాలయానికి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసుకునేందుకు స్వేచ్ఛను కల్పించారు. 2012లో నోటిఫికేషన్ జారీచేసిన సమయంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిలిపివేశారని, వీటిని చేర్చడం తప్పు అని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించేందుకు వైస్ చాన్స్‌లర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి నిరాకరించారు.
నాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తెలంగాణ యూనివర్సిటీలో ఘోరమైన అన్యాయం జరిగింది. 2012 నోటిఫికేషన్లో అనర్హులకు పెద్దపీట వేయడం ద్వారా నేను హిందీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును దక్కించుకోలేకపోయాను. రోస్టర్ పాయింట్లు మార్చడం ద్వారా ఎస్టీ కోటాలో నాకు దక్కాల్సిన ఉద్యోగం వేరే సామాజికవర్గానికి వెళ్లిపోయింది. ఈ అన్యాయాన్ని గుర్తించి నాతోపాటు 10 మంది అధ్యాపకులు, అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించాము. విచారణ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చివరికి న్యాయం దక్కింది. – వెంకట్‌నాయక్, టీయూ 2012 నియామకాలపై పోరాడిన వ్యక్తి