ఖైరతాబాద్, డిసెంబర్ 1 : మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిందని పలువురు వక్తలు స్పష్టంచేశారు. అమరుడు పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా పోలీస్ కిష్టయ్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో స్మారకోపన్యాస సభ సీనియర్ జర్నలిస్టు పిట్టల రవీందర్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు దాటినా ఇంకా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదని చెప్పారు. దేశంలో తెలంగాణ ఉద్యమానికి ఓ చరిత్ర ఉన్నదని, ఆ చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం మాములుగా రాలేదని, ఎందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిందని స్పష్టంచేశారు.
నాడు కేసీఆర్‌ను దారుణంగా అరెస్టు చేశారని, ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం ప్రశ్నార్థకంగా మారిందని, ఇక మనకు దిక్కెవరన్న నిరాశ, నిస్పృహల నేపథ్యంలో మనుస్సులు చలించిన యువత ఆత్మహత్యలకు పాల్పడిందని గుర్తుచేశారు. వారిలో పోలీసు కిష్టయ్య, శ్రీకాంతాచారి లాంటి ఎందరో యువకులు ఉన్నారని, తమ ఆత్మహత్యలతోనైనా పరిష్కారం లభిస్తుందేమోనని వారు భావించారని, అప్పుడు పరిష్కారం లేకనే ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డారని చెప్పారు. తాను ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్‌గా పనిచేస్తున్న క్రమంలో మందమర్రిలో తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఉత్తరం చూస్తే ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆకాంక్ష, ఆవేదన ఎంత ఉన్నదో అర్థమైందని, ఆత్మహత్యలకు పాల్పడిన వారెవరూ నిరక్షరాస్యులు కాదని, తెలంగాణ గురించి సరైన అవగాహన ఉన్నవారే చనిపోయారని తెలిపారు. నాటి అమానవీయమైన రాజకీయాల నేపథ్యంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణకు మద్దతుగా రాజీనామాలు చేయకుండా తప్పించుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేవలం యువతే కాదని, జర్నలిస్టులు సైతం అసువులు బాసారని ఆవేదన వ్యక్తంచేశారు.
మలి ఉద్యమంలో అమరుల ఉత్తరాలే ఒక చరిత్ర అని, 1200 మంది బలిదానాలను చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన అవస రం ఉందని అల్లం నారాయణ స్పష్టంచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చావుకు ఎదురెల్లిన వా రిని తెలంగాణ వీరులుగా గుర్తించాలని కోరా రు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎక్కువగా బహుజనులే ఉన్నారని, పోరాటాన్ని రక్తంతో లిఖించేది కూడా ఆ వర్గాల వారేనని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాదు.. ఒక వివక్ష, పెత్తనం, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా, మన భాష, యా సను వెక్కిరించిన నేపథ్యంలో పుట్టుకొచ్చిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఓ విపత్కర పరిస్థితి నెలకొన్నదని, బీసీల్లో అతిపెద్ద పెద్ద కమ్యూనిటీగా ఉన్న ముదిరాజ్‌లకు ఓ మంత్రి లేడని, ప్రస్తుతం పేదల భూములు లాక్కోవడం, జాగలు గుంజుకోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.
కేసీఆర్ ఆమరణ దీక్షకు ముందు 50 శాతం మంది ప్రజలే స్వరాష్ర్టాన్ని కోరుకున్నారని, వారిలో ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, వారి సంఘాలు, జర్నలిస్టులే ఉన్నారని, కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షను పెంచిందని, రాష్ట్ర ఏర్పాటుకు పునాది వేసిందని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. కేసీఆర్ దీక్షతోనే నూటికి నూరు శాతం మంది ప్రజలు ఉద్యమంలో కలిసి వచ్చారని గుర్తుచేశారు. ‘ఆత్మహత్యలను సైకాలజిస్టులు మానసిక కుంగుబాటు, బలహీనతగా చెప్తుంటారు, మిగతా వర్గాలు అది పిరికి వారి చర్య అని, మరికొందరు పాపమని అంటుంటారు.. నేరపూరితమైందని చెప్తుంటారు.. కానీ ఓ ఫ్రెంచ్ మేధావి చెప్పినట్టుగా ఆత్మహత్య ఓ సాహసం.. ఒక సంఘీభావం.. ప్రజలను కలిపేందుకు ఉపయోగపడే సాధనం.. ప్రజలను సంఘటిత పరిచేందుకు సామాజిక ప్రతి చర్య’ అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలు క్షణికావేశం కాదని, కొన్ని తరాల దుఃఖాన్ని భరించలేక, తమ బలిదానాలతోనైనా రాష్ట్రం సిద్ధిస్తుందన్న బలమైన ఆకాంక్షతో ప్రాణత్యాగాలకు ఒడిగట్టారని గుర్తుచేశారు. పోలీస్ కిష్టయ్య సెల్ టవర్ ఎక్కినప్పుడు కొన్ని గంటల సేపు అక్కడి నుంచే మాట్లాడారని, వెనక్కి మాత్రం తిరిగి రాలేదని, తెలంగాణ వస్తుందన్న ఒక కృతనిశ్చయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 1200 మంది అమరులు ఒక ఆలోచనతో ఆత్మహత్య చేసుకున్నారని, వారి త్యాగాలను ఈ సమాజం మరిచిపోదని చెప్పారు. రిటైర్డ్ ఐజీ నరసింహ మాట్లాడు తూ దివంగత పోలీస్ కిష్టయ్యతో పాటు తెల ంగాణ అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కిష్టయ్య సతీమణి పద్మ, కుమారుడు రాహుల్, ముదిరాజ్ సేవా సమితి అధ్యక్షుడు ఉప్పరి నారాయణ ముదిరాజ్, యాదిగిరి ముదిరాజ్, సుమిత్ర పాల్గొన్నారు.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ప్రాణ త్యాగంచేసిన వీరుడా జోహార్’ అని పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్యకు ఆదివారం అశ్రునివాళులర్పించారు. ‘నీ మరణం యావత్ తెలంగాణ సమాజంలో స్ఫూర్తిని రగిలించింది’ అని ఎక్స్ వేదికగా ఆయన కొనియాడారు.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్‌ను ఆదివారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తమ కుమార్తె ప్రియాంక వైద్య విద్య కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుచేసిన పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను కేసీఆర్ అన్నివిధాలుగా అండగా నిలిచారని తెలిపారు. అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కవిత వెంట టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తనోబా తదితరులు ఉన్నారు.