హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీని ఏడాదిలోపే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో రెండు, మూడేండ్లు కొనసాగిన ఈ ప్రక్రియను కేవలం ఏడాదిలోపే పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నది. దీనిలో భాగంగా అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ప్రకటించారు. వాస్తవానికి ఈ పరీక్షను ఇంకా ముందే నిర్వహించాలని భావించినప్పటికీ ఇతర పరీక్షల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని మరికాస్త సమయం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
గ్రూప్-1కు విశేష ఆదరణ
రాష్ట్రంలో మొత్తం 503 పోస్టులతో వెలువడిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు గతంలో ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే 3,02,912 దరఖాస్తులు రాగా.. ఇప్పుడు కేవలం తెలంగాణలోనే 3,80,202 మంది దరఖాస్తు చేశారు. వీరికి ఆగస్టు, లేదా సెప్టెంబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించింది. కానీ ఇదే సమయంలో పలు ఇతర పోటీ పరీక్షలు జరుగనుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

అభ్యర్థులకు గొప్ప అవకాశం..
గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచే పకడ్బందీగా ముందుకెళ్తున్నాం. ఆగస్టులోనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని తొలుత అనుకొన్నాం. కానీ.. ఇదే సమయంలో యూపీఎస్సీ, బ్యాంక్, టీఎస్ పోలీస్ తదితర పలు పోటీ పరీక్షలు జరుగనుండటంతో వాటిని కూడా రాసుకొనేలా అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని భావించాం. అందుకే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16న, మెయిన్ పరీక్షను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇది అభ్యర్థులకు గొప్ప అవకాశం. ఈ నిర్ణయంతో ప్రిపరేషన్‌కు కావాల్సినంత సమయం దొరికినట్టే.
– జనార్దన్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్