హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, భవిష్యత్తు తరాలకు వైద్యుల కొరత ఉండకూడదనే సంకల్పం నేడు మెడికల్ సీట్లలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపింది. రాష్ట్రంలో ప్రతి పదిలక్షల మందికి 150 మెడికల్ సీట్లు ఉన్నట్టు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేయడం గర్వకారణం. అదే సమయంలో దేశంలో ప్రతి పదిలక్షల మందికి కేవలం 75 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. కాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలో సైతం ప్రతి పదిలక్షల మందికి 150 ఎంబీబీఎస్ సీట్లు కలిగి ఉన్నట్టు కమిటీ వెల్లడించింది. ఇక డబుల్ ఇంజిన్ సర్కారు అయిన యూపీలో ప్రతి పదిలక్షల మందికి కేవలం 21 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నట్టు కమిటీ నివేదించడం బీజేపీ పనితనం ఏ పాటిదో తేటతెల్లం చేస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికీ వేలమంది ఇతర రాష్ర్టాలు, దేశాలకు వెళ్లి వైద్యవిద్యను అభ్యసిస్తున్నట్టు స్పష్టం చేసిన కమిటీ ఆయా రాష్ర్టాలకు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించింది.
కేసీఆర్ విజన్ కమిటీ నివేదికతో సుస్పష్టం
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి జవసత్వాలు నింపాలంటే వైద్యుల కొరత తీర్చాలనే విశాల దృక్పథంతో నాడు సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. 2014లో స్వరాష్టం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. దీంతో వైద్యుల కొరత తీరిస్తేనే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని సంకల్పించి కొత్త వైద్య కాలేజీలు ఏర్పాటు చేశారు. దీంతో 2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఏకంగా 9,140కి చేరగా, ఇవే విషయాలు తాజాగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదికతో మరోమారు తెలిసిపోయాయి.
వసతుల కల్పనలో రేవంత్ సర్కార్ విఫలం
బీఆర్ఎస్ సర్కార్ నాడు మెడికల్ కాలేజీలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినా రెండేండ్లు పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. వైద్యవిద్య ప్రాధాన్యతను ఆనాడే కేసీఆర్ గుర్తిస్తే నేడు కాంగ్రెస్ పెద్దలు మెడికల్ కాలేజీల నిర్వహణను గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. ఇదే విషయమై జూన్లో జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) వైద్యకాలేజీల్లో వసతులు కల్పించకపోవడంపై ప్రభుత్వంపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా రేవంత్ సర్కారు స్పందించి వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లు, లైబ్రరీలు, లాబొరేటరీలను మెరుగుపర్చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.