హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ-మొబిలిటీ విధానాన్ని ప్రకటించిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ వీసీ గోపాలకృష్ణన్ అన్నారు. ఈ-బాజా సొసైటీ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇంజినీర్ ఇండియా-2024 (ఎస్ఏఈ ఇండియా-2024)ఆధ్వర్యంలో ఆదివారం నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ 2020లోనే ఈ-మొబిలిటీ పాలసీని ప్రకటించిందని, 2030 నాటికి రూ.32 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 1.25 లక్షల ఉద్యోగాలను కల్పించాలన్న లక్ష్యంలో ఇప్పటికే 75% లక్ష్యాన్ని సాధించిందని వివరించారు.
2030 నాటికి రూ.50 వేల కోట్ల పెట్టుబడులను రాబట్టడంతోపాటు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతో రాష్ట్రం నిరుడు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ)ని ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ కేవీ విష్ణురాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సుల వైపు మొగ్గు చూపుతుండటంతో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రాధాన్యత తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో ఆ కోర్సులకు ఊతమిచ్చేందుకు ఆటోమోటివ్ రంగాలు ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా ఆల్-టెర్రైన్ ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎస్ఏఈ ఇండియా ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. దేశంలోని వివిధ కాలేజీలకు చెందిన 71 జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి.