హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నీటి వనరులు సంక్షోభ స్థాయికి చేరడానికి 20 రోజుల ముందే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. సోమవారం ఆయన కుందన్‌బాగ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎల్ నినో పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన, భూగర్భ జలాలు, విద్యుత్తు, మున్సిపల్, మిషన్‌భగీరథ శాఖల ఉన్నాతాధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈసారి తీవ్రస్థాయి ఎల్ నినో ప్రభావం ఉన్నదని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారని గుర్తుచేశారు. వచ్చే ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉన్నదని, తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రస్తుతం ఏడు ప్రధాన వనరుల నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నామని, నీటి లభ్యత సంక్షోభ స్థాయికి చేరడానికి కనీసం 20 నుంచి 25 రోజుల ముందుగానే ప్రభుత్వానికి సమాచారమివ్వాలని అధికారులను ఆదేశించారు.
మేడిగడ్డ మరమ్మతులకు రంగం సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి సాంకేతిక పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయని, నివేదికల ఆధారంగా పునరుద్ధరణ పనుల డిజైన్ల రూపకల్పన కొనసాగుతున్నదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భద్రతపై నిపుణులు ధ్రువీకరించే వరకూ బరాజ్‌లను నిర్వహణలోకి తీసుకొనిరాబోమని స్పష్టంచేశారు. డయాఫ్రం వాల్ నిర్మాణం పునరుద్ధరణలో భాగం కావచ్చని భావిస్తున్నప్పటికీ, నివేదికలను పరిశీలించిన అనంతరమే మరమ్మతుల విధానాన్ని నిర్ణయిస్తామని వివరించారు. బడ్జెట్‌పై ఆధారపడకుండా సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించేందుకు కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తకువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శాఖకు చెందిన భూములు, ఇతర ఆస్తుల పూర్తి వివరాలను 15 రోజుల్లో సిద్ధం చేసి వనరుల సమీకరణకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.