సిద్దిపేట, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట శివారులో (ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సమీపంలో) జునో జూల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించనున్నారు. తొలి దశలో 3 ప్లాంట్ల సామర్థ్యంతో 30 టీపీడీకిగాను రూ.210 కోట్లతో భూమి పూజచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలు, పాలసీలను కొనసాగిస్తామని అన్నారు. పరిశ్రమలు తీసుకురావడం కోసం బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ భూసేకరణ చేసిందని, అందరి లక్ష్యం ఒక్కటేనని స్పష్టంచేశారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పరిశ్రమలు తీసుకువస్తున్నామని తెలిపారు. 65 శాతం ఎల్పీజీ గ్యాస్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. రాబోయే కాలంలో బయో ఫ్యూయల్ ఇంధనం ఇక్కడే మనం ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు.
‘నాడు కన్న కల ఇప్పుడు ఒకొకటిగా నెరవేరుతుండటం.. మొన్న ఆయిల్‌పామ్ పరిశ్రమ, నేడు బయోగ్యాస్ ప్లాంటు ఇకడికి రావడం చాలా సంతోషంగా ఉంది’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. నర్మెట ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్న ఉద్దేశంతోనే 2014-15లో సుమారు 100 ఎకరాలు సేకరించి టీఎస్ఐఐసీకి అప్పగించినట్టు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇకడ పుషలంగా నీళ్లు రావడం వల్లే వాతావరణంలో తేమ శాతం పెరిగి ఆయిల్‌పామ్ తోటల సాగుకు అనుకూలంగా మారిందని అన్నారు. అలాగే బయోగ్యాస్ ప్లాంటుకు కూడా పరోక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని చెప్పారు. ఒకప్పుడు యాసంగి వస్తే సిద్దిపేట ప్రాంతంలో కేవలం 8 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, కాళేశ్వరం రాకతో అది 85 వేల ఎకరాలకు చేరిందని అన్నారు. ఈ బయోగ్యాస్ ప్లాంటుకు ముడిసరుకు వరి గడ్డి అవసరమని, అది ఇక్కడ పుషలంగా దొరుకుతుందని తెలిపారు.
ఈ ప్లాంటు రావడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు కేవలం వరి ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చేవని, ఇకపై హార్వెస్టర్ల ద్వారా కోసిన తర్వాత మిగిలిపోయే వరి గడ్డిని ఈ కంపెనీ కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఫలితంగా అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని చెప్పారు. దేశానికి అవసరమైన గ్యాస్‌లో 50 శాతానికిపైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి బయోగ్యాస్ ప్లాంటు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత గల ప్లాంటును స్థాపిస్తున్న పారిశ్రామికవేత్త రాయపాటి శరత్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు భువనేశ్వరి కలిత, ప్రేమ్చందర్, సంతోష్, మాజీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, వీ హనుమంతరావు, జునోజూల్ బయో ఫ్యూయల్స్ సీఈవో రాయపాటి శరత్, ప్రముఖులు పాల్గొన్నారు.