106 ఎకరాల్లో బొమ్మల తయారీ క్లస్టర్
దండు మల్కాపూర్‌లో ఏర్పాటు యత్నం
కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సొంతగా ముందుకు సాగుతున్న రాష్ట్రం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఐటీ, ఫార్మా రంగాల తరహాలో తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రం (టాయ్స్ హబ్)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపూర్‌లో 106 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ అత్యాధునిక బొమ్మల తయారీ పరిశ్రమలు కొలువుదీరేలా ప్రత్యేక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే శామీర్‌పేట్‌లోని తునికి బొల్లారంలో 50 ఎకరాల్లో ఏర్పాటవుతున్న టాయ్స్ క్లస్టర్‌కు అదనంగా దండుమల్కాపూర్‌లో మరో క్లస్టర్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం టాయ్స్ క్టస్టర్‌ను మంజూరు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా ముందుకు సాగుతున్నది. సంప్రదాయ బొమ్మల తయారీకి నెలవుగా ఉన్న తెలంగాణలో పత్తి దిగుబడులు, ఇతర ముడి సరుకుల లభ్యత పుష్కలంగా ఉండటంతో రాష్ర్టాన్ని బొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
రాష్ట్రంలో ఇప్పటికే అనేక చిన్నతరహా బొమ్మల తయారీ పరిశ్రమలు కొలువుదీరాయి. హైదరాబాద్ చుట్టుపక్కల పలు కుటీర పరిశ్రమలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. యూనివర్సల్ టాయ్స్ సంస్థ జీడిమెట్లలో నెలకు లక్ష బొమ్మల తయారీ సామర్థ్యంతో సాఫ్ట్ టాయ్స్ యూనిట్‌ను నిర్వహిస్తున్నది. ఈ పరిశ్రమ విస్తరణ కోసం టీఎస్ఐఐసీ ఇటీవల దండుమల్కాపూర్ టాయ్స్ క్లస్టర్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అలాగే బటర్‌ఫ్లై టాయ్స్, ఛోటా భీమ్ టాయ్స్ తదితర సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. స్థలాలు కేటాయించాలని టీఎస్ఐఐసీకి ప్రతిపాదనలు సమర్పించాయి. మరోవైపు పలు చిన్నతరహా బొమ్మల తయారీ కంపెనీలు కూడా అధికారులను సంప్రదిస్తున్నాయి.
బొమ్మల తయారీలో తెలంగాణకు ఘన చరిత్ర
స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలను మన రాష్ట్రంలో అధికంగా తయారు చేస్తున్నారు. నిర్మల్‌లోని హస్తకళలకు 400 ఏండ్ల ఘన చరిత్ర ఉన్నది. ప్రత్యేకించి చెక్క బొమ్మల తయారీలో ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇప్పటికే ఈ బొమ్మలకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు కూడా లభించింది. మరోవైపు మెదక్ జిల్లా బొంతపల్లిలో తయారయ్యే చెక్క, లక్క బొమ్మలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. తక్కువ బరువు గల చెక్కతో తయారయ్యే ఈ బొమ్మలు చాలా కాలం మన్నుతాయి. పిల్లలతో వ్యాయామం చేయించేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. సరైన నైపుణ్య శిక్షణ, ఆధునిక టెక్నాలజీ అందిస్తే వీటిని సరికొత్త డిజైన్లలో అభివృద్ధి చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.
టాయ్స్ క్లస్టర్ల మంజూరులోనూ వివక్షే
గత ఏడాది దేశంలోకి 15 కోట్ల బొమ్మలు దిగుమతి అయ్యాయి. వాటిలో 90% చైనా, తైవాన్ నుంచే వచ్చాయి. మనం దిగుమతి చేసుకొన్న బొమ్మల్లో 67% సురక్షితమైనవి కావని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) తేల్చింది. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం టాయ్స్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నది. విదేశీ బొమ్మలపై దిగుమతి సుంకాన్ని పెంచడంతోపాటు హస్తకళలు, జీఐ గుర్తింపు పొందిన బొమ్మలకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ చర్యలు దేశంలో టాయ్స్ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష బొమ్మల తయారీ రంగంలోనూ కొనసాగుతున్నది. స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ పథకం కింద దేశవ్యాప్తంగా 35 టాయ్స్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు కేటాయించింది. వాటిలో 8 క్లస్టర్లకు గత ఏడాది బడ్జెట్లో ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్‌కు 3, రాజస్థాన్‌కు 2, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ఒక్కో క్లస్టర్ చొప్పున కేటాయించి తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. వాస్తవానికి కర్ణాటకలో ఇప్పటికే ఒక క్లస్టర్ కొనసాగుతున్నప్పటికీ కేంద్రం మరో క్లస్టర్‌ను మంజూరు చేసింది. ఏపీలో సైతం ఇప్పటికే ఒక క్లస్టర్ ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణకు టాయ్స్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు.