హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీటీఏ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్లు ఎదురొంటున్న సమస్యలు, ధరణి, భూ సమస్యల పరిషారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సమస్యలు, పదోన్నతులపై వినతిపత్రం సమర్పించారు. అధికారాలన్నీ కలెక్టర్ల దగ్గర కేంద్రీకృతం అయి ఉన్నందున భూ సమస్యల పరిషారం ఆలస్యం అవుతున్నదని మంత్రి వివరించారు. రైతులకు మరింత చేరువయ్యేందుకు భూ పరిపాలనలో సమగ్రమైన మార్పులు తేవాలని, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. జీవో 317 రద్దుతో పాటు రెవెన్యూ కోర్టులు, అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ, టీజీటీఏ ప్రధాన కార్యదర్శులు రమేష్ పాక, అరేటి రాజేశ్వర్, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ హాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, కోశాధికారి శ్రీనివాస్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.