హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. మెరుగైన ప్రదర్శనతో ఔరా అనిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట జడ్పీ స్కూల్ విద్యార్థులు వడ్నాల రేష్మ, పండుగ సహస్ర, గైడ్ టీచర్ వీ మహేశ్‌చంద్ర ఆధ్వర్యంలో రూపొందించిన స్మార్ట్ గ్లౌజ్ ప్రాజెక్టుకు ద్వితీయ స్థానం దక్కింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం స్కూల్లో ఈ నెల 19న ప్రారంభమైన సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మంత్రి దామోదర నర్సింహ, ఎంపీ రఘునందన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దక్షిణాది రాష్ర్టాలు పాల్గొన్న ఈ సైన్స్ ఫెయిర్‌లో మొదటి స్థానంలో పాండిచ్చేరి, ద్వితీయ స్థానంలో తెలంగాణ, తృతీయ స్థానంలో కర్ణాటక నిలిచాయి. వడ్నాల రేష్మ, పండుగ సహస్ర రూపొందించిన స్మార్ట్ గ్లౌజ్ పక్షవాత బాధితులు, పుట్టు మూగవారికి ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు వివరించారు. ఈ పరికరం తయారీకి పలు సెన్సార్లను వినియోగించామని వెల్లడించారు.
చేతివేళ్లలోని బొటన వేలుకు తొడిగిన సెన్సార్ ప్రధానపాత్ర పోషిస్తుందని చెప్పారు. బొటనవేలుకు ఉన్న మెయిన్ సెన్సార్ ఇతర వేళ్లకు తగిలించినప్పుడు వివిధ రకాల అవసరాలకు సంబంధించిన మెసేజ్‌ను మానిటర్లో నిక్షిప్తం చేయడంతోపాటు దానికి అమర్చిన లౌడ్‌స్పీకర్ మనకు తెలియజేస్తుందని తెలిపారు. బాధితులు ఇచ్చిన సందేశాన్ని మెసెజ్ రూపంలో వారీ సంబంధీకులకు లొకేషన్‌తోపాటు చేరవేస్తుందని పేర్కొన్నారు. రోగికి సంబంధించిన సంపూర్ణ వివరాలను అప్లికేషన్లో పొందుపరిచినప్పుడు సంబంధిత వ్యక్తి హెల్త్ రిపోర్టు తెలుపుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై కూడా మార్గదర్శనం చేస్తుందని చెప్పారు. ఈ డివైజ్‌ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కూడా ఉపయోగించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వీరిని ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, సర్పంచ్ మామిడి రాజు, ఉప సర్పంచ్ నాగరాజుశర్మ, ఉపాధ్యాయులు అభినందించారు.