Sainik School | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 96 శాతం మార్కులు సాధించినా తెలంగాణ విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి. ప్రతిభ ఉన్నా సీట్లు పొందలేని దుస్థితి. కానీ, ఇతర రాష్ర్టాలకు చెందినవారు 85-90 శాతం మార్కులొచ్చినా సీటు దక్కించుంటారు. దీనికి కారణం తెలంగాణలో సైనిక్ స్కూళ్లు లేకపోవడమే. పైగా కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో తెలంగాణకు హోంస్టేట్ హోదాను రద్దుచేయడం. మన విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండగా, ఇది మన విద్యార్థులకు శాపంగా మారింది.
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో వరంగల్ జిల్లా ధర్మసాగర్‌కు సైనిక్ స్కూల్ మంజూరైంది. స్థల సేకరణ కూడా పూర్తయ్యింది. అయితే, కేంద్రం సైనిక్ స్కూల్‌ను ఏర్పాటుచేయలేదు. అంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ సర్కారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. స్థలాన్ని కూడా సమకూరుస్తామని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఇదిలా ఉండగా ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, హుస్నాబాద్‌లో సైనిక్ స్కూళ్లు ఏర్పాటుచేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని రాజకీయం, రాద్ధాంతం చేయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు. ఇలా రాష్ట్రం ఒకలా.. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి మరోలా వ్యవహరించడం గమనార్హం.
ఒక వైపు ఏపీలోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లలో తెలంగాణ విద్యార్థులకు హోంస్టేట్ హోదాను రద్దుచేశారు. మరోవైపు తెలంగాణకు కొత్త సైనిక్ స్కూళ్లను మంజూరుచేయలేదు. దీంతో తెలంగాణ విద్యార్థులు సైనిక్ స్కూళ్లల్లో ప్రవేశాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. హోంస్టేట్ హోదా రద్దుతో తెలంగాణ విద్యార్థులు 67 శాతం సీట్లు కోల్పోయారు. ఆలిండియా కోటాలో 33 శాతం సీట్లకు మన విద్యార్థులు పోటీపడాల్సిన పరిస్థితి. అంటే మెరిట్ ఉన్నా, మంచి మార్కులొచ్చినా సీట్లపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇంత నష్టం జరుగుతున్నా మన ఎంపీలు, కేంద్ర మంత్రులు పట్టించుకోవడంలేదు.
తెలంగాణకు కనీసం మూడు స్కూళ్లు మంజూరు చేయాలి. సైనిక్ స్కూళ్లు ఏర్పాటయ్యే వరకు కోరుకొండ, కలికిరి స్కూళ్లల్లో తెలంగాణకు గల హోంస్టేట్ హోదాను పునరుద్ధరించాలి. ఇప్పటికే పరీక్షరాసిన వారికి స్థానిక కోటాలో ఏపీ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పించాలి.
– కల్యాణి, క్రాంతి కీన్ ఫౌండేషన్