హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించిం ది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 4.4 శాతం ఉన్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతోపాటు, పలు రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నవంబర్ మాసంలోని నిరుద్యోగిత రేటు వివరాలను సీఎంఐఈ బుధవారం విడుదల చేసింది. జాతీయంగా నిరుద్యోగిత రేటు 7.4 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో 9.1 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 6.7 శాతం గా ఉన్నది. గోవా, జార్ఖండ్, త్రిపుర, బీహార్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో నిరుద్యోగం పెరగడంతో రెండంకెల నిరుద్యోగిత రేటు నమోదైంది. దక్షిణాది రాష్ర్టాలైన ఏపీలో నిరుద్యోగిత రేటు 6.3 శాతం ఉం డగా, తమిళనాడులో 5.1 శాతం, కర్ణాటకలో 2.8 శాతంగా ఉన్నది. జాతీయంగా తెలంగాణ కన్నా 18 రాష్ర్టాల్లో నిరుద్యోగితరేటు అధికంగా ఉండటం గమనార్హం.ఏడేండ్లకాలంలో తెలంగాణ ప్రభుత్వం 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసింది.