హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణ కోసం తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీఎస్పీఎఫ్) పోలీసులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ)కి లేఖ రాసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ అప్రజాస్వామికంగా ఏపీ సర్కార్ నాగార్జునసాగర్ డ్యామ్‌పైకి సాయుధబలగాలతో తరలివచ్చి కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ, 13వ నంబర్ వరకు ఉన్న గేట్లను ఆక్రమించడం, ఆ తరువాత కేంద్ర జల్‌శక్తి శాఖ జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేయడం తెలిసిందే.
కేఆర్ఎంబీ ఆదేశాలు లేనిదే ఎవరినీ డ్యామ్‌పైకి రానివ్వకూడదంటూ సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం ఆదేశించింది. దీంతో నాటి నుంచి ఏపీ ఆక్రమణలో ఉన్న డ్యామ్ కుడివైపు 512, 420, 250 మీటర్ల చెక్‌పోస్టుల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలే పహారా కాస్తున్నాయి. గతంలో విధులు నిర్వర్తించిన తెలంగాణ బలగాలను ఆయా చెక్‌పోస్టుల వద్దకు రానివ్వడం లేదు. అనుమతివ్వాలని కేఆర్ఎంబీని కోరినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం సాగర్ డ్యామ్ నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణదేనని వివరించారు.
ఏపీ కుడివైపు ప్రాంతాన్ని ఆక్రమించినా ఇప్పటికీ నిర్వహణను తెలంగాణనే చూస్తున్నదని వెల్లడించారు. కుడివైపు ఆయా చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయాలని టీజీఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్‌ను కోరగా ఒక అధికారితోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించారని గుర్తుచేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద పహారా కోసం వారు వెళ్లితే సీఆర్పీఎఫ్ బలగాలు మాత్రం అనుమతివ్వడం లేదని, కేఆర్ఎంబీ నుంచి స్పష్టమైన ఆదేశాలు తప్పనిసరని చెబుతున్నారని తెలంగాణ అధికారులు ఎన్డీఎస్ఏకు వివరించారు. సాగర్ డ్యామ్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీసులను అనుమతించాలని, ఆ మేరకు బోర్డుకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేయాలని ఎన్డీఎస్ఏను తెలంగాణ అధికారులు కోరారు.