Telangana State Sarpanches Association | సుల్తాన్ బజార్, ఫిబ్రవరి 11: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చిందని రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. ఇప్పుడు క్లిష్టమైన పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరమన్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, తాజా మాజీ సర్పంచ్‌లతో కలిసి మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు తొలి మెట్లైన పదవ తరగతి, ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు.
గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణతో విద్యార్థులు విద్యాభ్యాసంపై ఏకాగ్రత కోల్పోతారని, వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నదని గూడూరు లక్ష్మీ నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ముగిశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు. అలాగే గత ఐదేండ్లలో గ్రామపంచాయతీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి, వాటి తాలూకు బిల్లులు అందక సర్పంచ్‌లు ఆర్థికంగా కుదేలైపోయారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతూ వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా వారిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సర్పంచులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికలయ్యాక మాట తప్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, ఎస్సీ వర్గీకరణలో తగు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం నేతలు బాలరాజ్ ముదిరాజ్, బొజ్జ రామేశ్వర్ రెడ్డి, ప్రకాశ్, పెద్దపల్లి రమేష్, చంద్ర శేఖర్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు.