హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): బీజేపీ.. కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ (టీఎస్పీహెచ్సీ) చైర్మన్ కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేకే పేపర్ లీకేజీ కుట్రలకు ఆ పార్టీ నేతలు తెరలేపారని పేర్కొన్నారు.
కుట్రలు, కుతంత్రాలు వారికి వెన్నతో పెట్టిన విద్య అని, ప్రజా సంక్షేమ పథకాలతో మెప్పు పొందిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించడం సాధ్యంకాదనే ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు విద్యార్థులు, యువతను పావులుగా వాడుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పరీక్షలను సజావుగా నిర్వహించిందని గుర్తు చేశారు. లీకేజీల వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఆపాదించాలనుకున్న బీజేపీ నేతలు తాము తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని ఎద్దేవా చేశారు. అధికారమే పరమావధిగా చౌకబారు రాజకీయాలకు దిగిన బీజేపీకి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.