G Chinna Reddy | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : కొందరు రాజకీయ నాయకులు డబ్బు ఖర్చు చేసి నిరుద్యోగులతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారని, దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉన్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆరోపించారు. సచివాలయంలోని మీడియా పాయింట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకొచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ మేరకు ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు.
గ్రూప్ వన్ నోటిఫికేషన్, మెయిన్స్ షెడ్యూల్ కూడా ఇచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. తాము ఒకేసారి 20వేల పోస్టులు భర్తీ చేస్తే నాణ్యమైన అభ్యర్థులు దొరకరనే ఉద్దేశంతో మొదట 11 వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. మిగతా 9వేల పోస్టులతో మరో నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు.
కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులను ప్రేరేపించి ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ధర్నా చేయొద్దని, అవసరమైతే ప్రజాభవన్‌కు వచ్చి నిరసన తెలపాలని కోరారు. ప్రజావాణిలో చేసే దరఖాస్తులకు ఫలితాలు కూడా వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని కోరారు.