(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యేనాటికి గరిష్ఠంగా 95 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోనున్నారు. కొత్త ఓటర్లుగా నమోదు, ఓటరు జాబితాలోని పేర్ల తొలగింపు, ఓటరు వివరాల్లో సవరణలు చేసేందుకు సంబంధించిన ఫారం-6, 6ఏ, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధ వారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గల్లంతయ్యే ఓట్లపై అంచనాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ‘సర్’ షెడ్యూల్‌కు ముందు రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు.
అయితే, జూలై 10న ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ గడువు ముగిసే నాటికి 2,64,87,213 మంది మాత్రమే తమ వివరాలు సమర్పించారు. దీంతో పత్రాలు సమర్పించని 73,39,235 ఓట్లను ఆబ్సెంట్/షిఫ్టెడ్/ డెడ్/డూప్లికేట్(ఏఎస్‌డీడీ) క్యాటగిరీలో చేర్చి ముసాయిదా నుంచి తొలగించారు. ఇక 2.64కోట్ల మంది ఓటర్ల నుంచి వచ్చిన ఎన్యుమరేషన్ పత్రాల్లో 92,88,181 మందికి ఈసీ అధికారులు నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 71,23,526 మంది సహేతుక సమాధానాలు సమర్పించి అర్హత సాధించారు. తాజా గణాంకాల ప్రకారం.. తుది జాబితా వెలువడే నాటికి గరిష్ఠంగా 95లక్షల ఓట్లు తొలగించనున్నట్టు తెలుస్తున్నది.

అలా చివరికి.. రాష్ట్రంలో కనిష్ఠంగా 2.43 కోట్ల మంది ఓటర్లు మిగిలే అవకాశమున్నట్టు సమాచారం. ‘సర్’ ప్రక్రియలో కొత్తగా ఓటు హక్కు పొందేందుకు అర్హత కలిగిన యువత నుంచి ఇప్పటివరకు 4.88 లక్షల మంది, విదేశాల్లో నివసిస్తున్న 6,270 మంది భారతీ యులు కూడా తమ పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొంటే, తుది జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.48 కోట్లుగా ఉండనున్నట్టు సమాచారం. అయితే, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ఓటర్లు, తొలగించిన ఓట్లపై నవంబర్ 9న ‘సర్’ తుది జాబితాను ఈసీ అధికారులు విడుదల చేయనున్నారు.
‘సర్’ ముసాయిదా జాబితాను బట్టి.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలవారీగా చూస్తే, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 3,29,828 ఓట్లు తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ (2,76,924 ఓట్లు), రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్(2,70,284 ఓట్లు) నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలోని 7 నియోజకవర్గాల్లో 2లక్షలకు చొప్పున ఓట్ల తొలగింపు జరుగుతుండగా, 17 నియోజకవర్గాల్లో లక్ష నుంచి 2లక్షల వరకూ ఓట్లు కోల్పోయే ప్రమాదమున్నట్టు తెలుస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతి తక్కువగా 10,227 మేర ఓట్లు కోల్పోయే అవకాశమున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 39,715 ఓట్లు తొలగించే జాబితాలో ఉన్నట్టు సమాచారం.
‘సర్’ ప్రక్రియ పూర్తయ్యేనాటికి హైదరాబాద్ సిటీ పరిధిలోనే 40.21 లక్షల మేర ఓట్లు గల్లంతు కాబోతున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో గతంలో 1.14 కోట్ల మేర ఓటర్లు ఉండగా.. ‘సర్’ ముసాయిదా జాబితా విడుదల తర్వాత ఈ ఓటర్ల సంఖ్య 71 లక్షలకు తగ్గింది. అంటే దాదాపు 43 లక్షల ఓట్లు ఏఎస్‌డీడీ, ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి ఇవ్వనివారి క్యాటగిరీలో చేర్చారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన నోటీసులకు స్పందించి కేవలం 2,78,216 ఓటర్లు మాత్రమే తమ ఓట్లు తొలగించవద్దని క్లెయిమ్ చేసుకున్నారు. అంటే వీరి పేరు ఓటరు జాబితాలో చేరితే దాదాపు40.21 లక్షల మంది తమ ఓట్లు కోల్పోనున్నారు.

రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల సంఖ్య, తొలగించిన ఓట్లను బేరీజు వేసుకొని చూస్తే, పెద్ద రాష్ర్టాల్లో అత్యధికంగా తెలంగాణలోనే 27.8 శాతం మేర అంటే గరిష్ఠంగా 95 లక్షల మేర ఓట్లను తొలగించే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో 44.7 లక్షల (10.8 శాతం) మేర ఓట్లను తొలగించే అవకాశమున్నట్టు సమాచారం. ఇక, ‘సర్’ ప్రక్రియలో భాగంగా దేశంలోని పెద్ద రాష్ర్టాల్లోనూ భారీస్థాయిలో ఓట్లను తొలగించినట్టు నివేదికలను బట్టి అర్థమవుతున్నది. మహారాష్ట్రలో ప్రస్తుతం ‘సర్’ ప్రక్రియ కొనసాగు తుండగా.. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 2.07 కోట్ల మేర ఓట్లను(21.1 శాతం) తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లో 2.04 కోట్ల ఓట్లను(13.21 శాతం) తొలగించగా, కర్ణాటకలో 1.06కోట్ల ఓట్లను(19.5 శాతం) తొలగించినట్టు నివేదికలను బట్టి అర్థమవుతున్నది.