హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని, ఆర్థిక వ్యవస్థకు, పౌరులకు పెను ముప్పుగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. గత సంవత్సరం ఇండియా నుంచి రూ.22,812 కోట్లు కొట్టేశారని, ఒక తెలంగాణలోనే 1,20,869 మంది సైబర్ నేరాల బారినపడ్డారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘షీల్డ్-2025’ కాంక్లేవ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ ముందున్నదని, కేంద్రం ఎన్నోసార్లు మన అధికారులను అభినందించిందని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకో సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్‌గా మార్చాలని సీఎం ఆకాంక్షించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు.
డీప్ ఫేక్ దుర్వినియోగంపై చర్యలు
ప్రపంచవ్యాప్తంగా డీప్ ఫేక్ సమస్య తీవ్రంగా మారుతున్నదని, ఏఐ టూల్స్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆందోళన వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం సైబర్ నేరాల నియంత్రణకు కట్టుబడి ఉన్నదని చెప్పారు. డీప్ ఫేక్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ బెదిరింపుల నుంచి పోలీసు విభాగాలు, ప్రభుత్వ సంస్థలను ముందస్తుగా రక్షించడానికి తెలంగాణ సైబర్ డిఫెన్స్ సెంటర్ (టీజీసీడీసీ)ను స్థాపించడానికి చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. 2024లోని 18 వేల మంది సైబర్ బాధితులకు రూ.183 కోట్లను తిరిగి అందించినట్టు పేర్కొన్నారు. సైబర్ భద్రతా చట్టాలను బలోపేతం చేయడం అత్యవసరమని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా చెప్పారు. సైబర్ సెక్యూరిటీ పరిశోధన, విధాన సంసరణలు, నైపుణ్యాభివృద్ధిలో భవిష్యత్ సహకారాల కోసం షీల్డ్-2025 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందుకు ఐఐటీ హైదరాబాద్, నల్సార్, ఐఎస్బీతో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ ప్రకటించారు.