వెనుకటికి పొలాల్లో ఒకరకమైన గడ్డి మొలిచేది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండేది కాదు. ఎంత పీకినా పొయ్యేది కాదు. సరికదా.. అసలు పంటను పండనిచ్చేది కాదు. రైతులంతా కలిసి దానికి కాంగ్రెస్ గడ్డి అని పేరు పెట్టుకొన్నరు. దాన్ని పోగొట్టాలంటే.. గట్టి కలుపు మందు వెయ్యాల్సిందే.
ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ఎక్కడుండె?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో.
అప్పుటికి పదేండ్లు అధికారంలో ఉన్నదెవరు?
గాంధీలు నడిపిన కాంగ్రెస్ పార్టీ.
ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎన్నేండ్లు ఏలింది?
దాదాపు 41 ఏండ్లు.
మరి 8 ఏండ్ల కిందటిదాకా తెలంగాణ ఎట్లుండె?
తెలంగాణ ఎవుసం ఎట్లుండె?
కరెంటు కోతలు, కల్తీ విత్తనాలు, దొరకని ఎరువులు, నీళ్ల కరువులు, పాలమూరు వలసలు, పొడిబారిన చెలకలు, తడి లేని మడి కట్టున దడికట్టిన నల్ల తుమ్మ చెట్టు కొమ్మకు పగ్గం అంచున వేలాడే దేహాలు. భోరుమని ఏడ్చినా.. బోరుబావీ చుక్క నీరు రాల్చలేదు. మన కన్ను చుక్క కన్నీరూ కార్చలేదు. ఎండిన పొలాలతో ఎండిన కండ్లు పోటీ పడేవి. పైగా మనకు ఎవుసం రాదని ఎకసెక్కం. గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు… బంగారమసుంటి మన భూములను పప్పు పుట్నాల కింద అమ్మి పక్క జిల్లాలకు పంచుడు. ఇదంతా మన కండ్ల ముందటి ముచ్చటే కదా
ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి మన తెలంగాణ..అచ్చంగా ఇప్పటి రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ ఛత్తీస్‌గఢ్‌లా ఉండేది. అవునా కాదా! మరిప్పుడెట్లున్నది?
తిన్న రేవు తల్వనిది కాదు తెలంగాణ. నియ్యత్ లేని వాళ్లు కాదు తెలంగాణ వాళ్లు. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు తమకూ వస్తున్నదని స్వయంగా కిందిస్థాయి కాంగ్రెస్ నేతలే చెప్తున్నరు. తెలంగాణ వచ్చినంక, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక ఎవుసం బాగుపడ్డదని చెప్తున్నరు.
కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న తమ రాష్ర్తంలో వ్యవసాయం ఏమాత్రం బాగాలేదని రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రజలు, రైతులు అంటున్నరు.
తెలంగాణలో వ్యవసాయం బ్రహ్మాండంగా మెరుగుపడ్డదని ఇక్కడి కాంగ్రెస్ నేతలు సైతం చెప్తున్నరు.
మరి రాహుల్‌గాంధీ ఏ రైతు కోసం సంఘర్షణ జరపాలి?
బాగుపడ్డ తెలంగాణ రైతు కోసమా?
బాధపడ్తున్న రాజస్థాన్ రైతు కోసమా?
ఉట్టికెగరలేనమ్మ స్వర్గాని కెగురుతానన్నట్టు, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ, తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతులను అరిగోస పెడ్తున్న పార్టీ నేత తగుదునమ్మా అని తెలంగాణకు నీతులు చెప్తాడట. మనం విని తరించాలట! అద్గదీ సంగతి. సమజవుతున్నదా!!
నమస్తే తెలంగాణ, నెట్వర్క్ మే 5: ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్.. రెండూ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలే. ఆ రెండు రాష్ర్టాల్లో వ్యవసాయ సంక్షోభానికి అక్కడి రైతులు పడుతున్న గోసే తార్కాణం. తెలంగాణలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో.. ఎంతగా చైతన్యవంతులయ్యారో.. ఇదిగో పుట్టి బుద్ధెరిగినప్పటినుంచీ కాంగ్రెస్‌లోనే ఉన్న నాయకుడు గంగారాం ఆనందాన్ని మించిన నిదర్శనం ఏమున్నది? కాంగ్రెస్ నేతలు ఇప్పుడు జవాబు చెప్పాలి. రైతులు సంఘర్షణ పడుతున్నదెక్కడ? రాహుల్‌గాంధీ సంఘర్షణ జరుగుతున్నదెక్కడ? అధికారంలోకి వచ్చిన పదే పది రోజుల్లో రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని పేరుగొప్ప హామీలిచ్చి పత్తా లేకుండా పోయిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు నిండుగా ఉన్న చెరువుల మధ్యన.. పచ్చగా ఉన్న పొలాల్లో నాగళ్లు పట్టుకొని నవ్వుతూ నిలుచున్న తెలంగాణ రైతుల దగ్గరకు వెళ్లి ఏం సంఘర్షణ చేయాలని చెప్తారు? ఎవరిపై సంఘర్షించాలని అడుగుతారు? తెలంగాణలో వాళ్లనో.. వీళ్లనో అడగాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ.. కాంగ్రెస్‌లో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ఏ ఒక్క నాయకుడిని అడిగినా చెప్తారు. ఎవరిదాకో ఎందుకు.. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో తనకు ఉన్న 32 ఎకరాల భూమికి ఏడాదికి రూ.3.20 లక్షల రూపాయల రైతుబంధు అందుకొంటున్నారు. పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డికీ రూ.65 వేల పెట్టుబడి సాయం అందుతున్నది. రైతు బీమా పథకానికీ వీరు అర్హులుగా ఉన్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏ జిల్లాలో.. ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా.. పార్టీలకతీతంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి సంక్షేమ ఫలాన్ని అనుభవిస్తున్నది.. ఆస్వాదిస్తున్నది.
రైతుబంధు వస్తది.. సీఎంఆర్ఎఫ్ వచ్చింది
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత కుంటవినయ్రెడ్డి కుటుంబంలో తన పేరుమీద, తన భార్య, తల్లిదండ్రుల పేర్లమీద ఉన్న ఎనిమిది ఎకరాలకు రైతుబంధు వస్తున్నది. తన కాలుకు ఫ్రాక్చర్ అయితే.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం కూడా అందింది. సంక్షేమ పథకాలు అందే విషయంలో పార్టీల ప్రశ్నే లేదని.. పారదర్శకంగానే పథకాలు అందుతున్నాయంటున్న వినయ్‌రెడ్డికి.. రాహుల్గాంధీకానీ, పీసీసీ అధ్యక్షుడు కానీ ఏం జవాబు చెప్తారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. మాచారెడ్డి మండలం కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు చిటుకుల నర్సారెడ్డికి చెందిన 3.35 ఎకరాల భూమికి రైతుబంధు అందితే.. నిజాంసాగర్ మండలం తున్కిపల్లి కాంగ్రెస్ నేత కమ్మరి బ్రహ్మం బిడ్డ పెండ్లయితే కల్యాణ లక్ష్మి పథకం కింద లక్షా నూటపదార్లు అందాయి. ఆపదలో ఉన్న ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వ పథకాలు ఎంతో ఆదుకొంటున్నాయని, అండగా నిలుచుంటున్నాయని కమ్మరి బ్రహ్మం అన్న మాటలకు కాంగ్రెస్ నేతలు ముఖం చాటేయకుండా ఏం చేయగలరు? నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పులిపలుపుల గ్రామానికి చెందిన దోటి నారాయణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నారాయణ దంపతులకు దాదాపు పదెకరాల భూమి ఉన్నది. ఏటా లక్ష రూపాయల రైతు బంధు వస్తున్నది. ఈయన కూతురు పెండ్లయితే కల్యాణ లక్ష్మి లభించింది. నారాయణ దివ్యాంగుడు కావడంతో రూ.3 వేల పింఛన్‌కు అర్హత ఉన్నది. కానీ.. ఈయన దరఖాస్తు చేసుకోలేదు. తెలంగాణలో ఇంత అద్భుతంగా జరుగుతున్న సంక్షేమంపై రాహుల్‌గాంధీ చేసే సంఘర్షణ ఏమిటని ఆయన పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ముందుగా తమ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులను చక్కదిద్దుకొన్న తరువాత ఇతర రాష్ర్టాల్లో పరిస్థితిపై ఆలోచించడం మంచిదని సలహా ఇస్తున్నారు.
వివక్ష లేని సంక్షేమం
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టినా పార్టీ, ప్రాంతం, జాతి, కులం, మతం అనే తేడా ఉండదు. ఎలాంటి వివక్ష లేకుండా సబ్బండవర్ణాల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ ఎంతో పరిణతిని ప్రదర్శించింది. తెలంగాణ గడ్డమీద ఉన్న ప్రతి బిడ్డను.. తన పొత్తిళ్లలో పెట్టుకొని కాచుకొంటున్నది. టార్చిలైట్ పెట్టి వెతికినా ఏ రకమైన వివక్ష లేకుండా.. ఎంతో నిబద్ధతతో, పారదర్శకతతో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాల రుచిని అందించింది. ఒక్కో గడపలో ఐదారు పథకాలు చేరుకొన్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన మద్దూరి కనకయ్యకు రైతుబంధు ఒక్కటే కాదు.. రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్ వంటి పథకాలన్నీ అందాయి. తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లెక్కకు మిక్కిలిగా అందుకొంటున్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి.
సంక్షేమ ఫలాలు అందుతున్నయ్
సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. నాకు 3.20 ఎకరాల వ్యవసాయ భూమికి రైతుబంధు వస్తున్నది. మా నాన్నకు గీత కార్మికుడి పింఛన్ రూ.2 వేలు వస్తున్నది. కేంద్రం ధాన్యం కొనకుంటే సీఎం కేసీఆర్ కొనేందుకు ముందుకు వచ్చిండు. రైతులకు సీఎం కేసీఆర్ మంచి చేస్తున్నడు. మంచిపని ఎవరు చేసినా మంచే అనాలి కదా.
– బుడిగె ఐలేనిగౌడ్, గురువన్నపేట మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకుడు (సిద్దిపేట జిల్లా)
కాంగ్రెస్‌లో ఉన్నా.. దళితబంధు
నేను కాంగ్రెస్ మద్దతుతో వార్డు సభ్యుడిని అయ్యా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో నా దశ మారింది. గొర్రెల యూనిట్ కోసం రూ.పది లక్షలు మంజూరయ్యాయి. ప్రస్తుతం షెడ్ పనులు చేసుకుంటున్నా. సీఎం కేసీఆర్ పార్టీలకు సంబంధం లేకుండా పథకాలను అందిస్తుండటంతో అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు లబ్ధి కలుగుతుందని కలలో కూడా అనుకోలేదు.
-ఎడ్ల సాయిలు, వార్డు సభ్యుడు, కాంగ్రెస్, తున్కిపల్లి, కామారెడ్డి జిల్లా
సమయానికి డీఏపీ దొరకదు.. యూరియా దొరకదు.. కరెంటు మూడు నాలుగు గంటలు మాత్రమే ఉంటది.. తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నరు. ఇక్కడ ముఖ్యమంత్రే పట్టించుకోకపోతే ఏం చేస్తాం!
– రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో బల్బీర్ సింగ్ అనే ఓ రైతు ఆవేదన ఇది.
నీళ్లు లేవు.. వానపడకుంటే పంట పండదు. ఆడపిల్ల పెండ్లికి మా ప్రభుత్వం సాయం చేయదు. తెలంగాణలో ఎకరానికి పదివేల రైతుబంధు వస్తున్నది. ఆడబిడ్డ పెండ్లికి లక్ష పైన సాయం చేస్తున్నరు. కేసీఆర్ కిట్ లాంటి పథకాలెన్నో ఉన్నయి.. మాకూ ఈ పథకాలిస్తే బాగుండు..
– ఛత్తీస్‌గఢ్‌లోని పూణె ముని అనే పేద రైతు ఆక్రోశం ఇది.
నాకు, మా అమ్మకు ఉన్న ఏడెకరాలకు ప్రతి ఏటా రూ.70 వేల రైతుబంధు అందుకొంటున్నా. ఎన్టీ రామారావు తరువాత రైతుల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తిగా కేసీఆర్‌ను నేను భావిస్తున్నా..
– తెలంగాణలోని బోధన్ మండలం సాలూరకు చెందిన కాంగ్రెస్ నాయకుడు గంగారాం సంతోషం ఇది.
‘రైతుబంధు’తో ఎంతో మందికి లబ్ధి
వ్యవసాయ పనుల ప్రారంభంలో పెట్టుబడి సహాయం అందటం వల్ల రైతులకు ఆసరా అవుతున్నది. నాకు రెండెకరాలకు రైతుబంధు వస్తున్నది. దీంతోపాటు రైతుబీమా కూడా అందించి రైతు కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ఈ పథకాలు ఎప్పటికీ కొనసాగించాలి.
-ఎండీ జహీరుద్దీన్, కాంగ్రెస్ మండలనేత, జానకంపేట్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
రైతుబంధు మంచి పథకం
రైతుబంధు నిరుపేదలకు వరంలాంటిది. పేద, గొప్ప అనే తారతమ్యం లేకుండా సీఎం కేసీఆర్ పార్టీలతో భేదం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతుబంధు అందిస్తున్నడు. అర్హులైన నిరుపేద కుటుంబాలకు, కాంగ్రెస్ నాయకులు కూడా ఎంతోమంది కల్యాణలక్ష్మి, రైతుబీమా,ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేయడం నచ్చింది.
-బైరం కుమార్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు, రామాయంపేట (మెదక్ జిల్లా)
పెట్టుబడికి, ఇద్దరు బిడ్డల పెండ్లికి సాయమైండు..
రైతుబంధు పథకం మొదలైనప్పటి నుంచి నాకున్న 10 ఎకరాల పొలానికి పెట్టుబడి సాయం అందుతాంది. వానకాలం, యాసంగి పంటలు వేసేందుకు ఢోకా లేకుండా పైసల్ పడ్తున్నయ్. 24 గంటల కరెంటుతో నీళ్ల రంది లేదు. రాబడి మంచిగనే ఉంది. నా పెద్దబిడ్డకు కల్యాణలక్ష్మి అండగా నిలిచింది. చిన్నబిడ్డ పెండ్లి ఈ మధ్యల్నే చేసిన. కల్యాణలక్ష్మి కోసం అర్జీ పెట్టిన. బిడ్డల పెండ్లిల్లకు కల్యాణలక్ష్మి పెద్ద దిక్కు అయింది.ఇప్పటివరకు ఎవరినీ చేయి చాపకుండా సంతోషంగా ఎవుసం చేసుకుంటున్న.
– ఒజ్జల లింగయ్య, ములుగు
పథకాలతో లబ్ధ్ది పొందాను..
సీఎం కేసీఆర్సారు ప్రవేశపెట్టిన పథకాలతో నేను లబ్ధ్ది పొందాను. నాకు మూడెకరాల పొలం ఉంది. ప్రతి పంటకు 15 వేల రైతుబంధు వస్తున్నది. మా కూతురు పెండ్లి కాగానే కల్యాణలక్ష్మి కింద లక్ష నూట పదహారు రూపాయలు అందించారు. మా కూతురు ప్రసూతి డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చినారు. మా పొలానికి ఉచిత విద్యుత్ అందుతున్నది. మిషన్ కాకతీయ వల్ల చెరువులో నీళ్లు బాగా ఉన్నాయి.
– నీరుడి లింగయ్య, మల్లంపేట, పాపన్నపేట మండలం (మెదక్ జిల్లా)
కరెంటు పోతే 20 రోజులు పోతది
నాకు రెండెకరాల భూమి ఉన్నది. నీళ్ల సౌలతు లేదు. వానలు పడితెనే పంటలు పండుతాయి. మా తాన ప్రాజెక్టులు లేవు. మాకు కరెంటు వస్తే ఒక రోజు ఉంటది. పోతె ఇగ 20 రోజులు అటే పోతది. అదే తెలంగాణలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. 24 గంటల కరెంటు ఉంటది. అక్కడ పంటలు బాగ పండుతాయి.
– లక్ష్మణ్‌రావు, రైతు, ఛత్తీస్‌గఢ్
నీళ్లు లేవు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగడానికి కూడా నీళ్లు లేవు. ట్యాంకులు కడుతున్నారు. కానీ భూమిలో నీళ్లు లేవు. దీనికన్నా నదులను కలిపితే మేలు జరుగుతుంది. వరదలు వస్తున్న చోటు నుంచి కరువున్న చోటుకు నీళ్లు మళ్లిస్తే మంచిది. కరెంటు దారుణంగా ఉంది. ఇదివరకు కొంత నయం. ఇప్పుడు కరెంటుకు కోతలు పెడపతున్నారు. దేశమంతటా కూడా బొగ్గు కొరతవల్ల ఇదే పరిస్థితి ఉన్నది.
– రాంగోపాల్, దౌసా జిల్లా రాజస్థాన్
రాజస్థాన్‌లో రైతుల పరిస్థితి ఏమీ బాగాలేదు. నీళ్లు లేవు. పశువులకు దాణా లేదు. డీజిల్ ధర దారుణంగా పెంచేశారు. వ్యవసాయం చేసేదెలా?1947కు ముందులా ఉంది మా పరిస్థితి. ప్రపంచం ముందుకుపోయింది. కానీ మేం వెనుకబడే ఉన్నాం.
– రాంకుమార్ గుజ్జార్, రాజస్థాన్
తాగేందుకు నీళ్లు లేవు. ఇక వ్యవసాయం చేసేదెట్లా? మూడు గంటల కరెంటు ఇస్తున్నారు. ఆ కాస్తా కరెంటు కూడా అవసరమైనప్పుడు ఉండదు.
– బోదురామ్ ఝాట్, జైపూర్ రాజస్థాన్