Kaleshwaram | మహదేవపూర్/తొగుట, జూలై 23 : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరాంపూర్ మాజీ ఎమ్మెల్యే, అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమాని భానుదాను కాశీనాథ్ ముర్కుటే కొనియాడారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, మహారాష్ట్ర నేతలు 120 మంది రైతులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలోగల లక్ష్మీ బరాజ్, సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, గజ్వేల్ సమీకృత మార్కెట్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వారికి వివరించారు.
ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే భానుదాను కాశీనాథ్ ముర్కుటే మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శమని కొనియాడారు. అతి తక్కువ కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరును తాము పరిశీలించామని, ఇటువంటి అద్భుతాన్ని ఇదివరకు ఎక్కడా చూడలేదని తెలిపారు. దేశానికి సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు అవసరమని అన్నారు. తెలంగాణలో రైతుబంధు, సాగు నీరు, ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికి ఆసరాగా నిలుస్తున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణలోని అభివృద్ధిని మహారాష్ట్ర ప్రజలు తమ గ్రామాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ విధి, విధానాలు మహారాష్ట్రలోని గ్రామ గ్రామానికి చేరుకున్నాయని వారు పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగాల ద్వారా మహారాష్ట్ర ప్రజలు రోజురోజుకు చైతన్యవంతులు అవుతున్నారని చెప్పారు. కరెంటు విషయంలో సీఎం కేసీఆర్ విధానాలు, ప్రకటనలతో మహారాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని, ఈ మేరకు కరెంట్ కోతలు తగ్గించే దిశగా చర్యలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ పర్యటనలో అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ పుంజ హరితుకారాం షిండే, మాజీ చైర్మన్లు దిగంబర్ సజ్జేరావు షిండే, సురేశ్ మచ్చింద్ర గలాండే, మహారాష్ట్ర నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.