హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో ఆందోళనలు, నిరసనలు చేపడుతారనే అనుమానంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తాము అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వకపోయినా పోలీసులు అర్ధరాత్రి తమ ఇండ్లకు వచ్చి అదుపులోకి తీసుకున్నారని తెలంగాణ సర్పంచ్ల సంఘం ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ విమర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం అల్లదేవిచెరువు గ్రామంలోని తన ఇంట్లో ఉండగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. స్టేషన్ నుంచి వదిలిపెట్టిన తర్వాత యాదయ్యగౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, నిర్బంధపాలన అని నిప్పులుచెరిగారు. మాజీ ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాగయ్య, నాయకులు మధుసూదన్‌రెడ్డి, మల్లయ్య, సుభాష్‌గౌడ్, గణేశ్, పద్మారెడ్డిలు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రా మాల్లో మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పది గ్రామాల్లో మాజీ సర్పంచ్‌లను, ఖమ్మం రూరల్ మండలంలోని ఓ సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్‌కు తరలివెళ్లకుండా కూసుమంచిలో మాజీ వీఆర్ఏలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి పా లమూరు జిల్లాలోని పలుచోట్ల మాజీ సర్పంచ్‌లను పోలీస్స్టేషన్లకు తరలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లింగంపేట, ఎడపల్లి మండలాల్లో మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.