హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లోని జేఎల్, పీజీటీ పరీక్షలోని పేపర్1 జనరల్ స్టడీస్, పేపర్2పై తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పష్టత ఇచ్చింది. వీటి పూర్తి వివరాలన్నీ ట్రిబ్ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. పేపర్1 జనరల్ స్టడీస్‌ను రెండు స్థాయిల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. డీఎల్, జేఎల్, లైబ్రేరియన్, పీడీ, పీజీటీ పోస్టులకు పీజీ స్థాయిలో, టీజీటీ, స్కూల్ లైబ్రేరియన్, పీడీ పోస్టులకు యూజీ స్థాయిలో పరీక్షలుంటాయని వివరించింది.
పాఠ్యాంశాలు, అంశాల వారీగా పీజీ స్థాయిలో 3 గ్రూపులుగా, యూజీ స్థాయిలో 4 గ్రూపులుగా విభజించి పేపర్1 పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా, ఆయా గ్రూపుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నది. ఉదాహరణకు ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకొన్న పోస్టులన్నీ ఒకే గ్రూపులో ఉన్నట్టయితే సదరు అభ్యర్థి పేపర్1ను ఒకేసారి రాయాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న పోస్టులు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నట్టయితే సదరు అభ్యర్థి అందు కు అనుగుణంగా రెండుసార్లు పేపర్1 రా యాలని ట్రిబ్ స్పష్టం చేసింది. పీజీటీ, జేఎల్ పేపర్2ను (పెడగాజి) సబ్జెక్టులవారీగా కామన్‌గా నిర్వహించనున్నట్టు ట్రిబ్ వివరించింది.