హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలికన్సల్టేషన్కు అవార్డు లభించింది. వైద్య నిపుణులతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించడం ఈ టెలికన్సల్టేషన్ లక్ష్యం. ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే’ సందర్భంగా శనివారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ నుంచి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి అవార్డు అందుకొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 8 వరకు కేంద్ర ప్రభుత్వం ‘టెలికన్సల్టేషన్ క్యాంపెయిన్’ నిర్వహించగా, తెలంగాణ సత్తా చాటింది. రెండు నెలల్లో 17,47,269 కన్సల్టేషన్స్ పూర్తి చేసింది. తద్వారా తమిళనాడు, ఏపీ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టెలికన్సల్టేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్ల ద్వారా మొత్తం 5,876 కేంద్రాల నుంచి 12 రకాల టెలి కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నారు. పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానలకు వచ్చే రోగుల్లో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపించినా, పై దవాఖానల్లోని స్పెషాలిటీ నిపుణుల సలహాలు అవసరమని భావించినా సిబ్బంది వారికి ఫోన్ చేసి వైద్య సలహాలు పొందుతారు. ఇప్పటివరకు మొత్తం 27,24,247 మందికి టెలి కన్సల్టేషన్ సేవలు అందించడం విశేషం.
టెలి కన్సల్టేషన్ సేవల్లో రాష్ట్రానికి మూడో స్థానం దక్కడం శుభసూచకం. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆరోగ్య రంగంలో 3వ స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేయాలి.
– టీ హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి