హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి 11.59 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ ఎగుమతులు నమోదైనట్టు కేంద్ర సర్కారు తెలిపింది. శుక్రవారం లోక్సభలో ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కింద రూ.6.29 లక్షల కోట్ల యూనిట్లు ఎగుమతి అయినట్టు చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండలి సెస్ కింద రూ.5.3 లక్షల కోట్ల యూనిట్లు నమోదయ్యాయని తెలిపారు. అత్యధిక సాప్ట్వేర్ ఉత్పత్తులు కర్ణాటక నుంచి (రూ.3.96 లక్షల కోట్లు) ఎగుమతి అయినట్టు తెలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (రూ.2.37 లక్షల కోట్లు), తెలంగాణ (రూ.1.81 లక్షల కోట్లు) ఉన్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో నిలిచినట్టు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.