హైదరాబాద్ : అమరావతి రాజధాని ( Amaravati Capital ) చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులు ( BRS MPs, ) సురేష్‌రెడ్డి ( Suresh Reddy ) , వద్దిరాజు రవీచంద్ర ( Vaddiraju Ravichandra ) మద్దతు ప్రకటించారు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం తెలంగాణ రావలసిన పథకాల గురించి ప్రస్తావించారు.
మొదటిసారి విజయవాడలో అమరావతి కట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడికి వెళ్లి అక్కడి ప్రజలను మనస్సుపూర్తిగా ఆశ్వీరదించారని తెలిపారు . తెలంగాణ, ఏపీ ఉమ్మడిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టయినా జాతీయ హోదా ఇవ్వాలని పదేపదే కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణలో ప్రజల సొమ్ముతునే ప్రాజెక్టులను కట్టుకున్నామని , కేంద్రం ఇచ్చిన నిధులతో ఏవి లేవని వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును సైతం ప్రజా పన్నులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించి కట్టుకున్నామని వెల్లడించారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండించే రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్యినా, పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని , ముఖ్యంగా భద్రచలం ఆలయానికి చెందిన 5 గ్రామాల్లో ఉన్న భూములు,ఆస్తుల విషయంతో సమస్యలు వస్తున్నాయని వివరించారు. తెలంగాణ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను, ఒక్కో జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్, వరంగల్ , కొత్తగూడెం ఎయిర్‌పోర్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.