హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై ఈ నెల 16లోగా నివేదికను సర్కార్‌కు సమర్పించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. ఇప్పటికే 38 నెలలయ్యింది. ఉద్యోగులు, సంఘాల నేతలంతా 51 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేయాలని కోరారు. గతంలో పీకే అగర్వాల్ కమిటీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేస్తే కేసీఆర్ సర్కార్ 43శాతం ప్రకటించింది. సీఆర్ బిశ్వాల్ కమిటీ 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేస్తే కేసీఆర్ సర్కార్ 30శాతం మంజూరుచేసింది. శివశంకర్ కమిటీ ఎంత ఫిట్మెంట్ సిఫార్సు చేస్తుందన్న చర్చలు ఉద్యోగుల్లో నడుస్తున్నాయి. గురువారం ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పీఆర్సీ చైర్మన్ శివశంకర్‌ను కలిసి నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు.