హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్ యోజన)లో భాగంగా సర్కారు బడుల్లో కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణంలో తెలంగాణ అత్యంత వెనకబడి ఉంది. వెనకబాటుకు కేరాఫ్ అడ్రస్ అయిన బీహార్ కన్నా దీనస్థితిలో మనరాష్ట్రం ఉండటం గమనార్హం. రాష్ర్టానికి మంజూరైన కిచెన్ కమ్ స్టోర్స్‌లో ఇప్పటివరకు 58శాతం మాత్రమే నిర్మాణం పూర్తవగా, 42శాతం పెండింగ్‌లో ఉన్నాయి. జాతీయంగా నిర్మాణం పూర్తికాని వాటిని పరిశీలిస్తే తెలంగాణదే అత్యధికం. అనేక రాష్ర్టాలు ఈ విషయంలో తెలంగాణకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మహారాష్ట్ర 89 శాతం, అసోం 90, మణిపూర్ 92, మధ్యప్రదేశ్ 95, హరియాణా 96, ఏపీ 97శాతం చొప్పున కిచెన్ కమ్ స్టోర్స్‌ను నిర్మించాయి. ఈ రాష్ర్టాల్లో నిర్మాణం కానివి 10 నుంచి 3శాతమే. ఇక ఈ ఏడు రాష్ర్టాలు మినహా 29 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వందశాతం కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణాన్ని పూర్తిచేశాయి. కానీ తెలంగాణ వెరీపూర్ స్థితిలో ఉంది. ఈ విషయాలు ఇటీవలే కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెలుగుచూశాయి.
పీఎం పోషణ్ స్కీం కింద వంటశాలలు, వంట సరుకులను నిల్వచేసేందుకు స్టోర్స్‌ను నిర్మించాలని కేంద్రం పదేపదే సూచిస్తున్నది. ఇందుకు నిధులను సైతం మంజూరు చేస్తున్నది. జాతీయంగా 9,41,539 కిచెన్ కమ్ స్టోర్స్ మంజూరు కాగా, ఇప్పటి వరకు 9,11,301 (97శాతం) నిర్మించారు. 30,238 కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 12,647 ఒక్క తెలంగాణకు చెందినవే కావడం గమనార్హం. జాతీయంగా 41శాతం తెలంగాణలోనే పెండింగ్‌లో ఉన్నట్టు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఏటా పీఎం పోషణ్ ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో కేంద్రం తరుచూ తెలంగాణ అధికారులపై మొట్టికాయలేస్తున్నది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో చర్యలు చేపట్టడంలేదు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం ఆహారం వికటించడం, విద్యార్థులు అస్వస్థతకు గురవడం సర్వసాధారణమయ్యింది. సురక్షిత పద్ధతుల్లో వండకపోవడం, వంట సామగ్రిని నిల్వచేయడంలో లోపాలతో పురుగులు, బొద్దింకలు చేరి ఆహారంలోను వెలుగుచూస్తున్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాల ఘటన కలకలం రేపింది. సురక్షితంగా వండేందుకు కిచెన్షెడ్లు, స్టోర్స్‌ను నిర్మించాల్సి ఉండగా, ఈ విషయంలో సర్కారు నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తున్నది.