హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఇయర్ ఎండింగ్ నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) ప్రెస్ మీట్ నిర్వహించారు. 2025 ఏడాదికిగానూ పోలీసుల పనితీరుపై నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంలో శాంతిభధ్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. పోలీసులు ఎంతో సేవాభావంతో పని చేస్తున్నారని, ప్రాణాలకు తెగించి శాంతిభద్రతలను రక్షిస్తున్నారని అన్నారు.
2025లో తెలంగాణలో 782 హత్యలు జరిగాయని, క్రైమ్ రేట్ 2.33 శాతం తగ్గిందని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వర్షాలు, వరదల సమయంలో పోలీసులు సహాయక బృందాలతో సమన్వయంగా పని చేశారని చెప్పారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
జాతీయ, అంతర్జాతీయ సభలను అడ్డంకులు లేకుండా జరుపుకున్నామని టీజీ పోలీస్ బాస్ చెప్పారు. ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ పర్యటన కూడా విజయవంతమైందని అన్నారు. తెలంగాణ స్టేట్ పోలీసింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉందని తెలిపారు. తెలంగాణ టూరిస్ట్ పోలీస్ విభాగం పెట్టామని, అందులో 80 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు.
ఫీడ్ బ్యాక్ కోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో క్యూఆర్ కోడ్ పెట్టినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుతోపాటు ఐబొమ్మ రవి కేసుపైనా ఆయన స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉందని, ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఐబొమ్మ రవి కేసులో ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు.
2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 5.6 శాతం పెరిగిందని అన్నారు. అత్యాచారం కేసులు కూడా 2024తో పోల్చితే 2,945 నుంచి 2,549కి తగ్గాయని చెప్పారు. దోపిడీ కేసులు 703 నుంచి 512కు తగ్గాయన్నారు. అల్లర్ల కేసులు 324 నుంచి 186కు తగ్గాయని చెప్పారు. కిడ్నాప్ కేసులు 1525 నుంచి 1145కు తగ్గాయని చెప్పారు.