హైదరాబాద్ : తెలంగాణకు చెందిన కవి డాక్టర్ పత్తిపాక మోహన్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం వరించింది. ఈ ఏడాదికి గానూ 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు.
పత్తిపాక మోహన్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పత్తిపాక బాలల తాత బాపూజీ గేయ కథకు పురస్కారం దక్కడం గొప్ప విషయమని కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీపై రాసిన బాలసాహిత్యానికి తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందని తెలిపారు. డాక్టర్ సీ నారాయణరెడ్డి శిష్యుడు, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన పత్తిపాక మోహన్ సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.